కోడెల మృతిపై బాబుకు బాధ లేదు..! - మంత్రి బొత్స
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Sept 2019 7:31 PM IST
- కోడెల మృతిని బాబు రాజకీయం చేస్తున్నారు..!
- గవర్నర్ వ్యవస్థను చంద్రబాబు కించపరచలేదా?
- కేంద్రం ఏజెంట్ అంటూ గతంలో గవర్నర్ ను విమర్శించ లేదా?
- ఇప్పుడు గవర్నర్ కు ఏ ముఖం పెట్టుకుని వెళ్లి ఫిర్యాదు చేస్తారు?
- చంద్రబాబు అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారు
- కోడెల ఎందుకు బిజెపిలో చేరాలని అనుకున్నారు?
- మూడు నెలల్లో కోడెలను చంద్రబాబు ఎందుకు కలవలేదు?
- కోడెలపై నమోదైన కేసులు నిజమని మీరు నమ్మలేదా..?
- మీ నాయకులతో కోడెల వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని లీకులు ఇప్పించలేదా...?
- సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వను అని అన్నారు..
- ఇప్పుడు ఏ రకంగా సిబిఐ విచారణ కోరుతున్నారు?
అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యను చంద్రబాబు రాజకీయం చేయడం దురదృష్టకరమని రాష్ట్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోడెల శివప్రసాద్ మరణం పట్ల ఎంతో బాధపడ్డామన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయనకు ఏ అవమానం జరిగిందో... ఇంట్లో ఏం ఇబ్బందులు వచ్చాయో.. ఏ కారణం వల్ల చనిపోయారో అని వేదన చెందామన్నారు. తమ వంతు సానుభూతి తెలియచేశామన్నారు . అయితే గత మూడు రోజులుగా చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు చేస్తున్న హంగామా చూస్తుంటే బాధగా వుందన్నారు బొత్స. కనీసం కోడెల చనిపోయాడనే బాధ కూడా లేకుండా...
కనీస సానుభూతి కూడా లేకుండా.. చంద్రబాబు రాజకీయ కోణంలో.. ఏదో సాధించాలనే తాపత్రయంతో వున్నట్లు కనిపిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఈ రోజు గవర్నర్ ను కలవడానికి వెళ్లారని, గవర్నర్ ను కలడాన్ని మేం తప్పు పట్టడం లేదన్నారు. కానీ ఇదే చంద్రబాబు గవర్నర్ వ్యవస్థ ఒక పనికిమాలిన వ్యవస్థ అని, గవర్నర్ ఎవరూ, ఆయన ఒక ఏజెంట్ అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఆనాడు ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగితే... ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఫోన్ ద్వారా యోగక్షేమాలు తెలుసుకున్న సమయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు గుర్తు చేసుకోవాలన్నారు. రాజకీయాల్లో వున్న వారు.. నాయకత్వంలో వున్న వారు ఉపయోగించకూడని భాషతో గవర్నర్ ను విమర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థపై అలాంటి ఉద్దేశాలువున్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని గవర్నర్ ను కలిశారని ప్రశ్నించారు. మీకు అధికారం వుంటే ఒకలా.. లేకపోతే మరోలా వ్యవహరించే తీరుకు ఇది నిదర్శనం కాదా అని బొత్స నిలదీశారు.