కేఎల్ రాహుల్ 132.. బెంగళూరు 109
By తోట వంశీ కుమార్ Published on 25 Sept 2020 12:00 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో బెంగళూరు రాత మారలేదు. వేదిక మారిన కూడా కోహ్లీ సేన ఆట మాత్రం అదే. టోర్నీలో విజయంతో బోణి కొట్టిన జట్టు.. రెండో కనీసం పోరాటమైనా లేకుండా చేతులెత్తేసింది. రాహుల్ ఒక్కడు చేసిన స్కోర్‌ను టీమ్ మొత్తం కూడా దాటలేకపోయింది. కేఎల్ రాహుల్ 132 పరుగులు చేయగా.. బెంగళూరు 109 పరుగులకే కుప్పకూలింది. అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ.. రాయల్ ఛాలెంజర్స్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కనీసం ప్రతిఘటించనూ లేదు. పంజాబ్ టీమ్ కెప్టెన్ ఒక్కడే 132 పరుగులు చేస్తే.. ఆ బెంచ్ మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది కోహ్లీసేన. 23 పరుగుల దూరంలో ఆగిపోయింది.
ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా గురువారం రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాజయాన్ని చవిచూసింది. అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ.. రాయల్ ఛాలెంజర్స్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు రాహుల్(132 నాటౌట్; 69బంతుల్లో 14పోర్లు, 7 సికర్లు), మయాంక్ అగర్వాల్ (26; 20బంతుల్లో 4పోర్లు) తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. అనంతరం రాహుల్ జోరు కొనసాగించడంతో 10ఓవర్లకు 90/1తో నిలిచింది. అయితే.. బెంగళూరు బౌలర్లు పుంజుకోని ప్రమాదకర బ్యాట్స్‌మెన్లు పూరన్(17), మాక్స్‌వెల్(5)లను తక్కవ పరుగులకే పెవిలియన్ చేర్చారు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 128/3తో నిలిచింది.
పెద్దగా బౌండరీలు వెళ్లలేని పరిస్థితుల్లో పంజాబ్ 200పైగా పరుగులు చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ రాహుల్ చివరి రెండు ఓవర్లలో విశ్వరూపం చూపించాడు. స్టెయిన్ వేసిన 19ఓవర్‌లో రాహుల్ రెండు పోర్లు, మూడు సిక్సర్‌లు బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. శివమ్ దూబే వేసిన చివరి ఓవర్‌లో రాహుల్ ఆఖరి మూడు బంతుల్లో వరుసగా 4,6,6 బాదేశాడు. రాహుల్ వీరవిహారంతో ఆఖరి మూడు ఓవర్లలో పంజాబ్ 60 పరుగులు రాబట్టింది. దీంతో పంజాబ్ 20ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇక బెంగళూరు కెప్టెన్ కోహ్లీ కూడా రెండు సులువైన క్యాచ్‌లు వదిలేయడం కూడా రాహుల్‌కు కలిసొచ్చింది.
భారీ లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు జట్టు.. ఏదశలోనూ లక్యం దిశగా సాగలేదు. స్కోర్ బోర్డుపై పది పరుగులు కూడా చేరకుండానే మూడు వికెట్లు కోల్పోయింది. దేవ్‌దత్ పడిక్కల్(1), ఫిలిప్(0), కెప్టెన్ కోహ్లీ(1) త్వరగా వెనుదిరిగారు. ఇక ఫించ్ (20), డివిలియర్స్(28) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. పంజాబ్ స్పిన్నర్లు మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్ ధాటికి బెంగళూరు 17 ఓవర్లలోనే 109 పరుగులకు కుప్పకూలింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది.
ఈ మ్యాచ్ మొత్తం కేఎల్ రాహుల్ వన్ మ్యాన్ షో గా సాగిందనడంలో అనుమానాలు అక్కర్లేదు. బ్యాటింగ్‌లో చెలరేగిపోయి ఆడిన రాహుల్.. కెప్టెన్సీగా అద్భుతంగా రాణించాడు. తన జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఏ బౌలర్‌ను ఎలా? ఎక్కడ? వినియోగించాలో.. అక్కడ వినియోగించుకున్నాడు. ఇన్నింగ్ ఆరంభంలోనే వరుసగా వికెట్లు పడటంతో రాయల్ ఛాలెంజర్స్ టీమ్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఆ ఒత్తిడిని కొనసాగింపజేయడంలో రాహుల్ సక్సెస్ అయ్యాడు. ఏ ఒక్క బౌలర్‌నూ ధీటుగా ఎదుర్కొనలేకపోయారు బెంగళూరు బ్యాట్స్‌మెన్లు. స్వేచ్ఛగా ఆడలేకపోయారు.
తన దూకుడుతో రాహుల్.. రికార్డులను బద్దలు కొట్టాడు. రెండువేల పరుగుల ల్యాండ్‌మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్‌ను వెనక్కి నెట్టాడు. అతని 132 రన్స్‌ను నాలుగు భాగాలుగా చేసి చూస్తే.. తొలి 30 పరుగులను చేయడానికి 23 బంతులను ఎదుర్కొన్న రాహుల్.. ఆ సంఖ్యను దాటనే లేదు. మలి 30 పరుగుల కోసం 19 బంతులను తీసుకున్నాడు. 18 బంతుల్లో మూడో 30 పరుగులను సాధించాడు. ఇక తను ఎదుర్కొన్న చివరి తొమ్మిది బంతుల్లో విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. పరుగుల వరదను పారించాడు. తాను ఎదుర్కొన్న చివరి తొమ్మిది బంతుల్లో ఏకంగా 42 రన్స్ బాది అవతల పారేశాడు.