ఆయన పేరు సాదు జేకబ్. ఆయనది వెయ్యి కోట్ల వ్యాపారం. గార్మెంట్స్, సూపర్ మార్కెట్స్… ఇలా పలు రంగాల్లో ఆయన కోట్లు గడించాడు. వ్యాపారం మూడు పూవులు, 36 కాయలుగా విస్తరించింది. ఇంత చేసిన తరువాత ఆయనకు ప్రజలకు ఏదో చేయాలనిపించింది. అందుకే పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగాడు.

ఆయన దిగడం కూడా మామూలుగా దిగలేదు. ఆయన కంపెనీలోనే పనిచేసే 19 మంది అభ్యర్థులను కిజక్కాంబళం గ్రామ పంచాయతీ ఎన్నికల్లోకి దింపాడు. అన్ని పార్టీలూ కలిసి ఏకమై ఆయనపై పోటీకి దిగాయి. కానీ ఆయన సూపర్ మార్కెట్ సిబ్బంది 19 లో 17 స్థానాలు గెలుచుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కిజక్కాంబళం ఓ సూపర్ మార్కెట్ దేశమైంది. సో.. గత అయిదేళ్లుగా కిజక్కాంబళం సాదా జేకబ్ సామ్రాజ్యం. ఆ ఊరికి ఆయన “సార్.” ఆ ఊరికి ఆయన మాటే శాసనం.

జేకబ్ గారి రాజ్యంలో పేదలకు పది లక్షల రూపాయల విలువైన ఉచిత ఇళ్లు నిర్మాణమయ్యాయి. ఊళ్లోకి కొచ్చి, హైదరాబాద్ లు అసూయపడేలా ఒక అద్భుతమైన సూపర్ మార్కెట్ వచ్చింది. అందులో వస్తువులన్నీ అరవై శాతం డిస్కౌంట్ పై దొరుకుతాయి. ఉల్లి ధరలు దేశమంతటా గుండె ఝల్లుమనిపిస్తున్నా, కిజక్కాంబళం లో మాత్రం అరవై శాతం తక్కువ ధరకు దొరుకుతాయి. పక్కా రోడ్లు వేయించడం సాదా జేకబ్ గారి కైటెక్స్ కంపెనీ బాధ్యత. ఆ ఊరి జనాభా 35000. అందులో ఎనభై శాతం మందిని జేకబ్ తాను స్థాపించిన 2020 అనే ఉద్యమంలో భాగస్వాములను చేశాడు. అందరికీ ఎలక్ట్రానిక్ కార్డులిచ్చి, ఆ కార్డు చూపిస్తే అన్నిటా డిస్కౌంట్లు ఇవ్వడం ప్రారంభించాడు. వైద్య సేవల నుంచి స్కూలు ఫీజుల దాకా అన్నిటా డిస్కౌంటే.

Kizhakkambalam, 1 Copy

అంతే కాదు. అవినీతిని అంతం చేసేందుకు ఆయన ఎన్నికైన పంచాయతీ మెంబర్లందరికీ ప్రభుత్వం ఇచ్చే జీతం మీద అదనంగా తన వైపు నుంచి జీతాలు ఇచ్చాడు. అవినీతికి పాల్పడవద్దని వారిని హెచ్చరించాడు.

కాబట్టి కిజక్కాంబళం ఒక స్వర్గం. ప్రజలకు కావలసిన అన్నీ జేకబ్ గారి దయ వల్ల దొరుకుతాయి. కానీ ఆయన ఆ వూరికి నియంతలా మారిపోయాడని, ఆయన చెప్పిన పార్టీకే ప్రజలు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలి. ఆయన ఏం చెబితే అదే జరుగుతుంది. ఆయన నిర్ణయమే ఊరంతటికీ శిరోధార్యం.

Kizhakkambalam2

ఇప్పుడు 2020లో కేరళలో పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్లీ కిజక్కాంబళం పార్టీకి కాక సూపర్ మార్కెట్ కి ఓటేస్తుందా? పాలననే ప్రైవేటీకరించిన ఈ వింత ఉద్యమాన్ని మళ్లీ బలపరుస్తుందా? సదుపాయాలు సౌకర్యాలకు ఓటేస్తుందా లేక ఆయన నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తుందా? దేశంలోనే ఎక్కడా లేని విధంగా సూపర్ మార్కెట్ శాసనం నడిపించిన జేకబ్ గారికి మళ్లీ ఓట్లు పడతాయా లేక ఈ సారి ప్రజలు మరో మార్పును కోరుకుంటాయా? ఏం జరుగుతుందో వేచి చూద్దాం.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.