కేసీఆర్‌ అండతో అసద్‌ రెచ్చిపోతున్నాడు.. కిషన్‌రెడ్డి సవాల్‌..

By అంజి  Published on  25 Feb 2020 12:21 PM IST
కేసీఆర్‌ అండతో అసద్‌ రెచ్చిపోతున్నాడు.. కిషన్‌రెడ్డి సవాల్‌..

హైదరాబాద్‌: కేంద్రప్రభుత్వం అనేక సార్లు సభలో, బయట, ప్రచార సాధనాల ద్వారా సీఏఏ వల్ల దేశంలో ఎవరికి నష్టం లేదని చెప్పినప్పటికి.. కొంత మంది కావాలనే విష ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కావాలంటే రాజకీయ అంశాలపై ప్రజలకు వద్దకు వెళ్లండని సూచించారు. లేని అంశాన్ని ప్రచారం చేస్తూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

సీఏఏలో మైనారిటీలకు నష్టం చేసే ఏ ఒక్క అంశం కూడా లేదని, తాను హామీ ఇస్తున్నానని అన్నారు. ఇక్కడి మైనారిటీ ప్రజలను పాకిస్తాన్‌ పంపిస్తారు అంటూ దిగజారుడు ప్రచారం చేస్తున్నారని.. ఆ వ్యాఖ్యలను నమ్మవద్దన్నారు. అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామంటున్న రాజకీయ పార్టీలకు కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. దేశంలో ఉన్న 130 కోట్ల ప్రజలకు సీఏఏలో వ్యతిరేకంగా ఉన్న అంశాలను చెప్పాలన్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలని కిషన్‌రెడ్డి కోరారు.

ప్రధాని మోదీ భారతదేశ ప్రతిష్టను పెంచేలా ప్రయత్నం చేస్తున్నారని.. మేకిన్‌ ఇండియా ద్వారా భారత్‌ ప్రపంచంలోనే అగ్రభాగాన ఉండేలా కృషి చేస్తున్నారని అన్నారు. మోదీని విమర్శించడానికి ఏమీ లేకనే.. సీఏఏపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేవలం దేశం కోసం పని చేస్తున్న ప్రభుత్వం.. మోదీ ప్రభుత్వమేనన్నారు. అవినీతి, బంధుప్రీతి, కుటుంబ పాలన లేని ప్రభుత్వం మోదీది అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ, ఎమెఐఎమ్‌ పార్టీలు పోటాపోటీగా సీఏఏకు వ్యతిరేకంగా సభలు పెడుతున్నాయన్నారు.

చట్టంలో ఏముందో చెప్పేది ప్రభుత్వంలో ఉన్న తాము అని.. పాతబస్తీలో ఉన్న అసదుద్దీన్‌ ఓవైసీ కాదన్నారు. ఢిల్లీలో నిన్న ఒక పోలీస్‌ అధికారి చనిపోయాడు. ఒక చేతిలో జాతీయ పతాకం పట్టుకొని.. మరో చెత్తో రాళ్లతో పోలీసులను కొట్టి చంపడం ఎలాంటి దేశ భక్తి అని ప్రశ్నించారు. దేశ వ్యతిరేక చర్యలు ఎవరు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. షాహీన్‌బాగ్‌ రోడ్డును నెలలుగా నిర్బంధించి ఆందోళనలు చేస్తున్నా.. ప్రజలు అర్థం చేసుకుంటారని కేంద్రం సంయమనం పాటిస్తోందన్నారు.

చెప్పుడు మాటలు వినొద్దని ప్రజలకు సూచించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో జరుగుతున్న హింస వెనక ఎవరి హస్తం ఉంది అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. అసదుద్దీన్‌ నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. కేసీఆర్‌ అండ చూసుకొని అసద్‌ రెచ్చిపోతున్నాడని కిషన్‌రెడ్డి అన్నారు. ఎమ్‌ఐఎమ్‌ దోస్తాన్‌తో.. కేసీఆర్‌ పులి మీద స్వారీ చేస్తున్నాడని విమర్శించారు.

Next Story