దిండుతో ఇద్దరు పిల్లలను చంపి..తల్లి ఆత్మహత్య..కారణం ఏంటంటే!

By సుభాష్  Published on  18 May 2020 5:02 AM GMT
దిండుతో ఇద్దరు పిల్లలను చంపి..తల్లి ఆత్మహత్య..కారణం ఏంటంటే!

తనపై వస్తున్న నిందలను జీర్ణించుకోలేక ఓ తల్లి ఇద్దరు పిల్లలను చంపి, ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలంలం రేపింది. పోలీసులు నిర్ధారించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. తుమ్మల చెరువు గ్రామానికి రాధిక అనే మహిళకు వెల్దుర్తికి చెందిన లచ్చిరెడ్డితో 2013లో వివాహం జరిగింది. వ్యాపారం కోసం లచ్చిరెడ్డి ఆయన సోదరుడు నారాయణరెడ్డి రెండు కుటుంబాలు కలిసి హైదరాబాద్‌లోని కేబీసీ కాలనీలో జీవిస్తున్నారు.

అయితే ఏప్రిల్‌ 14న నారాయణరెడ్డి, హర్షితల కుమార్తె లిసిక (3) మరుగుదొడ్లు శుభ్రం చేసే యాసిడ్ తాగి మరణించింది. కాగా, లిసిక మృతి చెందడానికి రాధికనే కారణమంటూ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. గురువారం ఉదయం 11 గంటలకు రాధికను తుమ్మల చెరువు గ్రామంలో ఆమె తల్లిగారింటి వద్ద విడిచిపెట్టిన భర్త లచ్చిరెడ్డి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఇక హర్షిత కుమార్తె మృతికి కారణమని వస్తున్న నిందలను రాధిక (26) జీర్ణించుకోలేకపోయింది.

ఆదివారం సాయంత్రం ఇద్దరు పిల్లలు కృషిదీప్‌రెడ్డి (4), రషిక (12నెలలు)లను దిండును ముఖంపై అదిమిపెట్టి చంపేసి, రాధిక కూడా ఉరివేసుకుని మృతి చెందింది. రేషన్‌ తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆమె తల్లి ఇంటికి వచ్చే సరికి కుమార్తె ఉరివేసుకుని ఉండడాన్ని చూసి షాక్‌కు గురైంది. విషయం పోలీసులకు సమాచారం అందించంతో సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, సీఐ ప్రభాకర్‌, ఎస్సై సుధీర్‌కుమార్‌లు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే ఘటన స్థలంలో ఓ లేఖ లభ్యమైంది. హర్షితకు చెప్పండి.. నేను ఎలాంటి తప్పు చేయలేదు నాన్న.. అంటూ మరణానికి సంబంధించిన లేఖను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it