కిలాడీ లేడీ దీప్తి మరో కొత్త మోసం ..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2019 4:00 PM GMT
కిలాడీ లేడీ దీప్తి మరో కొత్త మోసం ..!!

  • రెవెన్యూ శాఖ పేరుతో దీప్తీ నకిలీ ఐడీ కార్డు సృష్టి
  • సీసీఎల్‌ఏ పీఏ నంటూ ఘరానా మోసం
  • ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ నగదు వసూలు

గుంటూరు : ఘరానా మోసాలు చేయడంలో దీప్తీ దిట్టా. విలాసవంతమైన జీవితం గడిపేందుకు రకరకాల మోసాలకు పాల్పడిన మామిళ్లపల్లి దీప్తి ఉదంతాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. సీఎంవోలో పీఏగా పనిచేస్తున్నానంటూ నమ్మించి ఉద్యోగాలు ఇప్పిస్తానని, స్థలాలు, పొలాల సమస్యలు పరిష్కరిస్తానంటూ మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. కిలాడీ లేడీగా మారి మాయ మాటలు చెప్పడం, అందుకు అవసరమైన నకిలీలను సృష్టించుకొని ఘరానా మోసాలకు పాల్పడింది. ఆమె చేసిన మోసాల్లో మరొకటి బయటపడింది. ఏకంగా ప్రభుత్వ చిహ్నంతో నకిలీ ఐడీ కార్డును తయారు చేసుకుందంటే ఆమె నేర స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు.

సీసీఎల్‌ఏ పీఏ పేరులో నకిలీ కార్డు

మొదట్లో ఆమె కారును సచివాలయంలోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించక పోవడంతో అందుకోసం ముందుగా మాజీ మంత్రులతో కలసి వెళుతూ పరిచయాలు పెంచుకుంది. అక్కడ ఏఏ విభాగాల్లో ఎవరు ఉంటారో తెలుసుకొని రాకపోకలు కొనసాగించడం ప్రారంభించింది. అనతి కాలంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనే స్థాయికి చేరింది. అప్పటి నుంచి తనకు తాను గుర్తింపు తెచ్చుకునేందుకు సీఎంవోలో పీఏ నంటూ పరిచయాలు చేసుకోవడం ప్రారంభించింది. కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ సిబ్బంది ఐడీ కార్డు చూపాలని కోరితే ఇంటి వద్ద మరచిపోయానని చెప్పి కాలం గడిపింది. ఇక ఇలాగైతే కష్టమని భావించి రెవెన్యూ శాఖ పరిధిలోని ‘చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ (సీసీఎల్‌ఏ)లో పీఏగా పనిచేస్తున్నట్లు ఏకంగా ఐడీ కార్డు సృష్టించుకుంది. కార్డును చూపుతూ మోసాలకు పాల్పడింది.

సెటిల్‌మెంట్లకు తెరతీసి.. !

ఖరీదైన కారులో తిరుగుతూ కారుపై ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ అని స్టిక్కర్‌ వేసుకొని సెటిల్‌మెంట్లకు తెరతీసింది. అప్పట్లో పోలీస్‌ అధికారులతో పరిచయాలను అడ్డుపెట్టుకోవడంతో పాటు ఆమె సామాజిక వర్గానికి చెందిన అధికారులు కూడా ఉండటం కలసి వచ్చిన అంశంగా మారింది. స్థల, పొలాల వివాదాలను పరిష్కరించాలంటూ పోలీసుల వద్దకు వెళ్లడం.. అవసరమైతే మాజీ మంత్రితో ఫోన్‌ చేసి ఏకపక్షంగా కూడా సెటిల్‌మెంట్లు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే గుంటూరు అర్బన్‌లో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఇద్దరి నుంచి రూ. 9 లక్షలు తీసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, బాధితులు మాత్రం వివరాలను తెలియచేసేందుకు సాహసించడం లేదంటే వారిని ఎంతగా భయపెట్టి ఉంటారో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఫోన్‌ స్విచ్చాఫ్‌

దీప్తి హైదరాబాద్‌కు మకాం మార్చడంతో స్నేహితుల ద్వారా కేసు నమోదు విషయం తెలుసుకోవడంతో ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసింది. అవసరమైన సందర్బాలలో ఆన్‌చేస్తూ మాట్లాడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బాధితులు కూడా పలుమార్లు ఫోన్‌ చేసినా సమాధానం ఇవ్వడం లేదని సమాచారం. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే.. ఆమె దేశం విడిచి పారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీస్‌ బాస్‌ స్పందించి కిలాడీ లేడీ ఆట కట్టించేందుకు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

వెలుగులోకి మరో కిలాడీ లేడీ బాగోతం!

మంగళగిరి: టీడీపీ మహిళా నాయకురాలు మామిళ్లపల్లి దీప్తిపై కథనాలు ఓ పక్క ఆ పార్టీ నాయకుల్లో గుబులు పుట్టిస్తుండగా, మరో పక్క అంతకు మించిన మరో కిలాడీ లేడీ ఉదంతం మంగళగిరిలో వెలుగులోకి వచ్చింది. గత రెండు రోజులుగా పట్టణంలో ఇదే హాట్‌ టాపిక్‌. పట్టణానికి చెందిన టీడీపీ జిల్లా మహిళా కార్యదర్శిగా పని చేస్తున్న ఓ మహిళ నేరుగా అప్పటి హోంమంత్రి చినరాజప్పతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌లతో పాటు డీజీపీని సైతం నేరుగా కలిసేది. నాయకులు, ఉన్నతాధికారుల పరిచయాలనే పెట్టుబడిగా పెట్టి సామాన్యులతో పాటు పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ సుమారు రూ.5 కోట్లు వసూలు చేసినట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆమె గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. దీంతో బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మాజీ హోంమంత్రి చినరాజప్ప, చినబాబు లోకేష్, డీజీపీల పేర్లు చెప్పి వసూలు చేసినట్లు పార్టీ నాయకులు చెబుతుండడం గమనార్హం. బాధితులు ఒక్కొక్కరు ఇళ్లకు వస్తుండటంతో గుట్టు బయటకు రాకుండా కొందరు నేతలు ఆమె విదేశాలలో ఉందని, రెండు మూడు రోజుల్లో వస్తుందని వచ్చిన వెంటనే తామే ఇప్పిస్తామని, కేసులు పెడితే ఏమీ చేయలేరంటూ బెదిరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని అనుచరుడు ఆమెకు అండగా నిలుస్తూ బెదిరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.

బాధితుల్లో కొందరి వివరాలు

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన యువ నేత ఉద్యోగాల కోసం రూ. 14లక్షలు, తెనాలికి చెందిన యువకుడు రూ.6 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యాపారి ఇసుక కాంట్రాక్టు కోసం రూ.60 లక్షలు, నారాయణ కళాశాలలో క్యాంటీన్‌ కోసం మరో యువకుడు రూ.6లక్షలు, మరో ఇద్దరు యువకులు ఉద్యోగాల కోసం రూ.10లక్షలు చెల్లించినట్లు ఇప్పటికే బయటపడ్డారు. దీనికితోడు గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉద్యోగాలు, కాంట్రాక్టుల పేరుతో రూ. 5కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేసిందని టీడీపీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో విదేశాల నుంచి వస్తుందని ఇంట్లోని వారు చెబుతుండడంతో బాధితులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.

Next Story
Share it