కిడ్నీలను కొంటాం, అమ్ముతాం.. రూ.50 వేలు బీమా కట్టాలి..
By అంజి Published on 10 Feb 2020 8:52 AM IST
బెంగళూరులో కిడ్నీ ఏజెంట్ల ముఠా గుట్టు రట్టైంది. కిడ్నీలను అమ్ముతాం, కొంటామంటూ దందా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 300 మంది అమాయకపు ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన ఈ నేరగాళ్ల ముఠా జైళ్లో ఊచలు లెక్కబెడుతోంది. ముఠా సభ్యుల్లో ముగ్గురు ఆఫ్రికాకు చెందినవారు కాగా, మరో ముగ్గురు త్రిపుర రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. త్రిపురలో పేద ప్రజలకు మాయమాటలు చెప్పి వారి నుంచి బ్యాంక్ అకౌంట్ల నంబర్లు తీసుకున్నారు. వారిపేరు మీదే సిమ్‌కార్డులు, ఏటీఎం కార్డులు పొందారు. ఆ తర్వాత సోషల్‌మీడియా వేదికగా చాలా డబ్బు సంపాదించవచ్చు అంటూ ప్రచారాలు చేశారు. బెంగళూరు సమీపంలోని బాణసవాడిలో ఓ ఆస్పత్రి డాక్టర్ పేరును వాడుకొని సుమారు 200 మందిని సంప్రదించారు. కీడ్నీలను కొనాలన్న, అమ్మాలన్న మొదట బీమా చేయాలని, ఇందుకోసం రూ.50 వేల నుంచి రూ.60వేల అవుతుందని ప్రజలను నమ్మించేవారు. ఆ తర్వాత కొందరు డబ్బులకు ఆశపడి, కొందరు తమ ఆర్థిక పరిస్థితి బాగు చేసుకోవడం కోసం ఈ ముఠాను సంప్రదించేవారు. ఈ విధంగా వారి నుంచి పొందిన డబ్బును త్రిపురలో తీసుకున్న బ్యాంక్ అకౌంట్లలో వేసి విత్ డ్రా చేసుకునేవారు.
తన పేరుతో కిడ్నీల దందాకు పాల్పడుతున్నారని తెలుసుకున్న ఆ వైద్యుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నీలను అమ్ముతాం, కొంటామంటూ.. తన ఆస్పత్రి పేరును దుర్వినియోగం చేశారని వైద్యుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇచ్చి వైద్యుల పేరుతో ఈ-మెయిల్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వైద్యుడు తెలిపాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న బాణసవాడి ఏసీపీ రవిప్రసాద్ నేతృత్వంలోని బృందం కిడ్నీ ముఠాను కనిపెట్టింది. వెంటనే వారిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి కేసు నమోదు చేశారు. నేరగాళ్లు.. ప్రముఖ వైద్యుల పేర్లను వాడుకుంటా దందాకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠా ఇప్పటివరకు 300 వందల మంది వద్ద ఒక్కొక్కరి రూ.50 వేల వరకు వసూళ్లకు పాల్పడ్డారు.