ఏనుగు మృతి: నిందితుల ఆచూకీ చెబితే రూ.2 లక్షల నగదు ప్రకటించిన హైదరాబాద్ వాసి
By సుభాష్ Published on 4 Jun 2020 4:07 PM GMTకేరళలోని మలప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు చంపిన ఘటనపై దేశ వ్యాప్తంగా అందరి హృదయాలను కదిలించింది. ఆహారం కోసం అలమటిస్తూ ఆ గ్రామంలోకి వెళ్లిన ఏనుగుకు కొందరు ఫైనాపిల్‌లో పేలుడు పదార్థం పెట్టి ఏనుగు నోట్లో పెట్టడంతో అది పేలి ఏనుగుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నొప్పి బాధను భరించలేక నదిలోకి వెళ్లి సేదతీరుతూ చివరికి మృతి చెందింది. అంతేకాదు దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ సైతం మృతి చెందడంపై ప్రతి ఒక్కరి మనసును కదిలించింది. గర్భంతో ఉన్న ఏనుగు చావడానికి కారకులపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.
కాగా, మానవత్వానికే మాయని మచ్చలా మిగిలిపోయే ఈ సంఘటనపై హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషన్ ఆఫ్ ఇండియా కూడా స్పందించింది. ఏనుగు ప్రాణాలు తీసిన నిందితుల ఆచూకీ చెబితే రూ. 50 వేల బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
అలాగే హైదరాబాద్‌లోని నెరేడ్‌మెట్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా స్పందించారు. ఏనుగును హతమార్చిన నిందితుల ఆచూకీ చెబితే రూ. 2 లక్షలు నగదు అందజేస్తానని ప్రకటించారు. మరో వైపు జంతు ప్రేమికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పేలుడు పదార్థాలు పెట్టి జంతువులకు తినిపించే మానవ మృగాలు ఈ సమాజంలో ఉన్నారంటే సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల అదుపులో ఓ వ్యక్తి
ఈ క్రమంలోనే ఈ ఘటనపై పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు అతడు నిరాకరించినప్పటికీ, కేవలం ప్రశ్నించి వదిలేస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఈ ఘటనపై అతనికి ఏమైనా సంబంధం ఉందా..? అనే విషయంపై విచారిస్తున్నారు. అలాగే నిందితులెవరైన తెలుసా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ఏనుగు మృతికి కారకులైన వారిని త్వరగా పట్టుకోవాలని కేరళ ప్రభుత్వం పోలీసు శాఖను ఆదేశించింది. ఎంతటి వారైనా తప్పించుకోలేరని సీఎం పినరరయి విజయన్ తెలిపారు. నిందితుల కోసం పలు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.