కరోనా కట్టడికి కేరళ సర్కార్‌ సంచలన నిర్ణయం

By సుభాష్  Published on  6 July 2020 3:31 AM GMT
కరోనా కట్టడికి కేరళ సర్కార్‌ సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రతరం అవుతున్ననేపథ్యంలో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. ఇప్పటికే కరోనాతో జీవితాంతం సహజీవనం చేయాల్సిందేనని, అందుకు జాగ్రత్తలు పాటిస్తూ, మాస్కులు, భౌతిక దూరం పాటించాలని ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలు చెబుతూ వస్తున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. అయితే కేరళ సర్కార్ కరోనా కట్టడిలో భాగంగా ముందస్తుగా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మరో సంవత్సరం పాటు కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ప్రభుత్వం ఆదేశించింది.

పని ప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌ లు ధరించాలని, అలాగే ప్రతి చోట ఆరు అడుగుల దూరం ఉంటూ పనులు చేసుకోవాలని సూచించింది. వచ్చే ఏడాది వరకు ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై రూ.10వేల వరకు జరిమానా విధించనున్నట్లు పేర్కొంది.

అంత్యక్రియలకు, వివాహ వేడుకలకు..

కాగా, అంత్యక్రియలకు, వేడుకలపై కూడా నిబంధనలు విధించింది. అంత్యక్రియలు వ్యక్తి మృతి చెందింతే అంత్యక్రియల సమయంలో 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని, వివాహ వేడుకలకు 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే శిక్షర్హులని తెలిపింది.

ధర్నాలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి

ఇక ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాలనుకుంటే అనుమతి తప్పనిసరి అని తెలిపింది. ఒక వేళ అనుమతి ఇస్తే ధర్నాలు, నిరసనలు, ర్యాలీలలో 10 మంది కంటే ఎక్కువ పాల్గొనరాదని, ఎక్కువ మంది పాల్గొంటే కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించింది.

అలాగే షాపులు, వ్యాపార ప్రదేశాల్లో శానిటైజర్లు విరివిగి వాడాలని తెలిపింది. వ్యాపార ప్రదేశాల్లో గరిష్టంగా 20 మందిని మాత్రమే అనుమతించాలి. కేరళ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునేవారు తప్పని సరిగా కేరళ ప్రభుత్వం ఇ-ప్లాట్‌ఫాంలో రిజిష్ట్రర్‌ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం పేర్కొంది.

కాగా, దేశంలో తొలిసారిగా కరోనా పాజిటివ్‌ కేసు కేరళలో నమోదైంది. అయితే అక్కడి ప్రభుత్వం సమర్థవంతంగా పని చేయడంతో కరోనా మహమ్మారిని కట్టడి చేయగలుగుతోంది. గతంలో నిఫా వంటి వైరస్‌ సోకిన సమయంలో కట్టడి చేసిన అనుభవం కేరళ సర్కార్‌కు ఉపయోగపడిందంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5430 పాజిటివ్‌ కేసులుండగా, ఇప్పటి వరకూ 26 మంది మాత్రమే మృతి చెందారు.

ఇక దేశ వ్యాప్తంగ అయితే కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం కేసులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి రోజు 18వేలకుపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక గడిచిన 24 గంటల్లో 24,850 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 613 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశంలో 6,73,165 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 19,268 మంది మృతి చెందారు. ఇక మొత్తం కేసుల్లో ఇప్పటి వరకు 4,09,083 మంది కరోనా నుంచి డిశ్చార్జ్‌ కాగా, 2,48,934 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక ఆదివారం వరకు దేశంలో 97,89,066 శాంపిళ్లను పరీక్షించగా, నిన్న ఒక్క రోజే 2,48,934 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది.

Next Story