వెండితెరకు దేవుడిచ్చిన వరం..!
By సత్య ప్రియ Published on 17 Oct 2019 12:00 PM GMT'మహానటి’ పేరు చెప్పగానే ఒకప్పుడు సావిత్రి గుర్తుకొచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆమె పాత్రను పోషించిన కీర్తి సురేష్ గుర్తుకొస్తోంది. అంతలా ఆ పాత్రలో జీవించేసింది కీర్తి. రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ కీర్తి సురేష్.. ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి ’ సినిమా కీర్తి సురేష్ నట జీవితాన్నే మార్చేసింది.
అయితే, ఆమె తమిళ సినిమాలకి అధిక ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ప్రస్తుతం తమిళంలో ఆమె పెంగ్విన్ సినిమాను చేస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, వైవిధ్యభరితమైన కథా కథనాలతో రూపొందుతోంది. కథ అంతా కూడా కీర్తి సురేశ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది.
ఈ రోజున కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను విడుదల చేశారు.
ఈ పోస్టర్ లో ఆమె గర్భవతిగా కనిపిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్టోన్ బెంచ్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంతోష్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని కీర్తి సురేశ్ భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.