వ‌ర‌ద‌ల్లో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ఆర్థిక సహాయం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Oct 2020 6:08 AM GMT
వ‌ర‌ద‌ల్లో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ఆర్థిక సహాయం

భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని చెప్పారు.

హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్ఎంసికి 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేస్తామని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల మరమ్మత్తులకు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చెప్పారు. నాలాలపై కట్టిన ఇండ్లు కూడా కూలిపోయాయని, వాటి స్థానంలో ప్రభుత్వ స్థలంలో కొత్త ఇండ్ల నిర్మాణం జరుపుతామని సీఎం స్పష్టం చేశారు.

లోతట్టు ప్రాంతాలు, అపార్టుమెంట్ల సెల్లార్లలో నీళ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సీఎం చెప్పారు. నీళ్లుండగానే విద్యుత్ సరఫరా చేయడం ప్రమాదం కనుక, ఒకటీ రెండు రోజులు ఇబ్బంది కలిగినా ప్రాణనష్టం కలగకుండా ఉండేందుకు నీళ్లు పూర్తిగా తొలగిన తర్వాతనే విద్యుత్ సరఫరా చేయాలని సీఎం ఆదేశిచారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు.

హైదరాబాద్ నగరంలో వరదల పరిస్థితిని గమనిస్తే, చాలా చోట్ల చెరువుల ఎఫ్.టి.ఎల్. పరిధిలో ఏర్పాటైన కాలనీలే జలమయమయ్యాయని సిఎం చెప్పారు. అపార్టుమెంట్ల సెల్లార్లలో నీళ్లు నిలవడం వల్ల కూడా చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని సిఎం వెల్లడించారు. అపార్టుమెంటు సెల్లార్లలో నీళ్లు నిల్వకుండా ఉండే ఏర్పాటు నిర్మాణ సమయంలోనే చేసి ఉండాల్సిందని సీఎం చెప్పారు. ఇక నుంచి అపార్టుమెంట్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే సందర్భంలో వరద నీరు సెల్లార్లలో నిలిచి ఉండకుండా ఉండే ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టాలని సీఎం ఆదేశించారు.

కాలనీలు, అపార్టుమెంట్లలో నిలిచిన నీల్లను తొలగించడానికి మెట్రో వాటర్ వర్క్స్, ఫైర్ సర్వీస్ సేవలను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఇండ్లపై హై టెన్షన్ లైన్లు పోయే ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, రాష్ట్ర వ్యాప్తంగా ఈ లైన్ల తొలగింపునకు కార్యాచరణ రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలను సమీక్షించారు. రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులను నిర్దేశించారు. హైదరాబాద్ లో ఎక్కువ ప్రభావం ఉన్నందున జిహెచ్ఎంసిలో పరిస్థితిని చక్కదిద్దడంపై ప్రత్యేకంగా చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు.

భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు సహాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడికి లేఖ రాశారు. రైతులకు సహాయం అందించడానికి రూ.600 కోట్లు, జిహెచ్ఎంసితో పాటు ఇతర ప్రాంతాల్లో సహాయ, పునరావాస, పునరుద్ధరణ చర్యల కోసం మరో రూ.750 కోట్లు సహాయం అందించాలని సీఎం కేంద్రాన్ని కోరారు.

Next Story