మ‌రో రెండు వారాలు లాక్‌డౌన్‌ను పొడిగించాలి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 April 2020 11:05 AM GMT
మ‌రో రెండు వారాలు లాక్‌డౌన్‌ను పొడిగించాలి

క‌రోనా వ్యాప్తిని నిరోధించ‌డానికి ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్ మ‌రో రెండు వారాలు పొడిగించాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని కోరారు. లాక్‌డౌన్ పొడిగించాలా..? లేక‌ ఒకేసారి ఎత్తివేస్తే జ‌రిగే ప‌రిమాణాల‌పై శ‌నివారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. నాలుగు గంట‌ల పాటు ఈ సమావేశం సాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కాన్ఫ‌రెన్స్‌లో ప‌లు సూచ‌న‌లు చేశారు.

భార‌త‌దేశం క‌రోనా వైర‌స్ పై ఏక‌తాటిపై నిల‌బ‌డి పోరాడుతుంద‌న్నారు. ఇదే స్పూర్తితో ముందుకు కొన‌సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి భార‌త్ చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను అంత‌ర్జాతీయ పత్రిక‌లు కూడా మెచ్చుకుంటున్నాయ‌ని తెలిపారు. క‌రోనాపై పోరాండేందుకు రాష్ట్రాల‌కు కేంద్రం నుంచి కావాల్సిన మ‌ద్దతు ల‌భిస్తోంద‌న్నారు. ప్ర‌ధాని కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌రితో మాట్లాడుతూ.. కావాల్సిన స‌హాయం అందిస్తున్నార‌న్నారు.

ప్ర‌ధాని అండ‌గా నిల‌వ‌డం మాకు ఎంతో మ‌నో ధైర్యాన్ని ఇచ్చింద‌న్న కేసీఆర్‌.. క‌రోనా పై జ‌రిగే యుద్దంలో భార‌తదేశం త‌ప్ప‌క గెలిచితీరుతుంద‌న్న విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరికట్ట‌డంలో లాక్‌డౌన్ ఉప‌యోగ‌ప‌డింద‌ని, క‌నీసం మ‌రో రెండు వారాల పాటు పొడిగించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇంత‌కు మించి ప్ర‌స్తుతానికి మ‌రో మార్గం లేద‌న్నారు.

వ్య‌వ‌సాయ ఆధారిత దేశం..

భార‌దేశానికి వ్య‌వ‌సాయ‌మే ఆధారం అని.. దేశంలో వ్య‌వ‌సాయంతోనే ఎక్కువ మందికి ఉపాధి క‌ల్పిస్తుంద‌ని, 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశానికి తిండి పెట్టడం మరే దేశానికి కూడా సాధ్యం కాదన్నారు. మనం ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధితో ఉన్నామ‌ని, ఈ పరిస్థితి కొనసాగాలి. అన్నం పెట్టే రైతుకు అండగా నిలవాలని తెలిపారు.

అటు వ్యవసాయాన్ని కాపాడేందుకు, ఇటు ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత లేకుండా ఉండేందుకు వీలుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నడిచేలా చర్యలు చేపట్టాలని, రైసు మిల్లులు, ఆయిల్ మిల్లులు, ఇతర వ్యవసాయాధారిత పరిశ్రమలు నడిచేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని సూచించారు.

దేశ వ్యాప్తంగా కోట్లాది టన్నుల పంటలు పండాయని, వీటిని సేకరించడం మన ముందున్న కర్తవ్యమ‌ని పేర్కొన్నారు. సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి స్థలం లేదని, ప్రజలకు మూడు నెలలకు సంబంధించిన ఆహార ధాన్యాలు ముందుగానే ఇవ్వడం వల్ల ప్రస్తుతం ఎఫ్.సి.ఐ.లో ఉన్న నిల్వలు ఖాళీ అవుతాయని తెలిపారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతులంద‌రూ ఒకే సారి మార్కెట్ కు రాకుండా ఉండేందుకు గ్రామాల్లోనే 6,489 కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేసి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను కొనగోలు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఒక్క ధాన్యం కొనుగోలు కోస‌మే ప్ర‌భుత్వం రూ.25వేల కోట్లు బ్యాంకు గ్యారంటీ ఇచ్చింద‌న్నారు. గ్రామాల్లోనే పంటలు కొని, రైతుల అకౌంట్లో డబ్బలు వేస్తున్నాం. ఇలా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్.సి.ఐ.కి అందిస్తున్నాం. ఎఫ్.సి.ఐ. నుంచి తిరిగి డబ్బులు రావడానికి నాలుగైదు నెలల సమయం పడుతున్నది. అప్పటి వరకు బ్యాంకులు బకాయిల చెల్లింపుకోసం ఒత్తిడి తేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

స్పానిష్ ఫ్లూ 1918 లో వచ్చినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, 2008లో కూడా మ‌రోసారి ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఏర్పడిందని అప్ప‌ట్లో సరైన చర్యలు తీసుకోవడం వల్ల కోలుకోగలిగామ‌ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయ‌ని, దీన్ని ఎదుర్కోవడానికి కూడా వ్యూహాత్మక ఆర్థిక విధానం అవసరమ‌ని సూచించారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానాన్ని ఆర్.బి.ఐ. అనుసరించాలన్నారు.

Next Story