ముఖ్యాంశాలు

  • జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు కశ్మీర్‌ స్పెషల్‌ పోలీస్‌ బృందం
  • మల్లాపూర్‌కు చెందిన వ్యక్తికి టెర్రరిస్టులతో సంబంధాలు.?
  • టెర్రరిస్టులకు ఆర్థిక సహకారాలు అందించినట్లు ఆరోపణలు

జగిత్యాల జిల్లా కశ్మీర్‌ స్పెషల్‌ పోలీస్‌ బృందం వచ్చింది. జిల్లాలోని మల్లాపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని తేలడంతో కశ్మీర్‌ పోలీసులు మల్లాపూర్‌కు ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. మల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో విచారణ చేపట్టారు. ఈ విషయమై జిల్లాలో తీవ్ర కలకలం రేగింది.

మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి టెర్రరిస్టులకు ఆర్థిక సహకారాలు అందించినట్లు ఆరోపణలు రావడంతో కశ్మీర్‌ పోలీసులు వచ్చారు. ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి టెర్రరిస్టులను లావాదేవీలు జరిపినట్లు కశ్మీర్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. దుబాయ్‌లో ఉన్న స్నేహితుడి సూచన మేరకు గూగుల్‌ పేలో పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ చేసినట్లు సమాచారం. మల్లాపూర్‌ మండల కేంద్రంలో స్థానిక పోలీసుల సహకారంతో కాశ్మీర్‌ పోలీసులు విచారణ చేపట్టారు.

మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌ గ్రామానికి చెందిన రాకేష్‌ అనే వ్యక్తిపై గతంలో కాశ్మీర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే మల్లాపూర్‌కు కాశ్మీర్‌ పోలీసులు వచ్చినట్లు సమాచారం. రాకేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.