ఐపీఎల్‌కు 'కరోనా' షాక్‌..? మ్యాచుల నిర్వహణపై ఆసక్తి చూపని రాష్ట్రాలు..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2020 2:10 PM IST
ఐపీఎల్‌కు కరోనా షాక్‌..? మ్యాచుల నిర్వహణపై ఆసక్తి చూపని రాష్ట్రాలు..!

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ఇప్పటికే ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్‌లో కూడా కరోనా వ్యాపిస్తుండడంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13వ సీజన్‌ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి ఐపీఎల్‌ పై అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా కర్ణాటకలోనూ నిరసనలు కనిపిస్తున్నాయి. బెంగళూరులో ఐపీఎల్‌ మ్యాచ్‌లను అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాకుండా అసలు ఈ సీజన్‌లో మ్యాచ్‌లనే రద్దు చేయాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసినట్లు సమాచారం.

అమెరికా నుంచి సోమవారం భారత్‌కు వచ్చిన బెంగళూరు టెకీకి కరోనా వైరస్‌ సోకినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా ఆ టెకీ యూఎస్‌ నుంచి తిరిగొచ్చాక ఏకంగా 2,666 మందిని కలిసినట్టు తేలింది. ఇదే ఇప్పుడు అందరినీ వణికిస్తోంది. ప్రస్తుతం అతడిని రాజీవ్‌ గాంధీ ఛాతీ ఆస్పత్రిలో ఉంచి చికిత్సనందిస్తున్నారు. అంతేకాకుండా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఐటీ కంపెనీలున్న ఏరియాలో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఏడు మ్యాచ్‌ల్ని ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ ఇప్పటికే షెడ్యూల్‌ని కూడా ప్రకటించింది. అయితే.. మ్యాచ్‌ల సమయంలో వేలాది మంది ఒకేచోట స్టేడియంలో ఉండనుండటంతో.. పెద్ద ఎత్తున కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వానికి ఆ లేఖలో కర్ణాటక గవర్నమెంట్ గుర్తు చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. బెంగళూరులో ఆర్సీబీ మ్యాచ్‌లు జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

హైకోర్టులో పిటీషన్‌..

ఐపీఎల్‌ 13వ సీజన్‌ నిర్వహించడానికి బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వొద్దని కోరుతూ మద్రాసు హైకోర్టులో న్యాయవాది అలెక్స్‌ బెంజిగర్‌ పిటిషన్‌ వేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌లో కరోనా మందుని ఇంకా కనుగొన్నట్లుగా ఇంకా నమోదు కాలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని.. దాని ప్రభావంతో ఇటలీ ఫెడరేషన్‌ లీగ్‌ను కూడా ఆ దేశ ప్రభుత్వం మైదానంలోకి అభిమానులను అనుమతించకుండా నిర్వహిస్తుందన్నారు. దీనిపై జస్టిస్‌ ఎంఎం సుంద్రేశ్‌, కృష్ణన్‌ రామస్వామి డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌ మ్యాచులను నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌గంగూలి ఇంతముందే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Next Story