క్రికెట్ = క‌పిల్ : ఈ రెండూ వేరుకాదేమో..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Jan 2020 11:15 AM GMT
క్రికెట్ = క‌పిల్ : ఈ రెండూ వేరుకాదేమో..!

కపిల్ దేవ్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. జాతి గ‌ర్వించే క్రీడా ర‌త్నం. భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరు సంపాదించిన ఆట‌గాడు. కెప్టెన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన మొద‌టి ప్రపంచకప్(1983) లోనే భారత్‌ను విశ్వవిజేతగా తీర్చిదిద్దిన మేటి సార‌ధి త‌ను. ఇలా ఎన్నో.. త‌న గురించి చెప్పుకుంటే వెళ్తే.. భార‌త క్రికెట్‌ను విన్నింగ్ ట్రాక్ ఎక్కించిన క‌పిల్.. నేడు 61వ వ‌డిలోకి అడుగిడుతున్నాడు.. ఈ సంద‌ర్బంగా ఆయ‌న గురించి ప‌లు విష‌యాలు తెలుసుకుందాం.

1959వ సంవ‌త్స‌రం జనవరి 6న రాంలాల్ నిఖంజ్, రాజ్ కుమారీలకు జన్మించిన కపిల్ దేవ్ స్వస్థలం ప్రస్తుత పాకిస్తాన్ లోని రావల్పిండి ద‌గ్గ‌ర‌లోని ఒక కుగ్రామం. దేశ విభజన సమయంలో భారత్‌కు వచ్చి చండీగడ్‌లో స్థిరపడ్డారు. ఇక 1975 నవంబర్‌లో హర్యానా తరఫున తొలిసారిగా దేశ‌వాలీ క్రికెట్‌లోకి ఎంట్రి ఇచ్చిన కపిల్ దేవ్.. తొలి మ్యాచ్‌లోనే ప్ర‌త్య‌ర్ది పంజాబ్‌పై 39 పరుగులిచ్చి 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు. నాలుగేళ్ల‌పాటు రంజీల్లో విశేషంగా రాణించ‌డంతో 1978లో భార‌త టెస్ట్ జ‌ట్టులోకి పిలుపువ‌చ్చింది.

1978, అక్టోబర్ 16న కపిల్ దేవ్ పాకిస్తాన్ పై ఫైసలాబాదులో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినాడు. తొలి టెస్టులో అంతగా రాణించ‌లేక‌పోయాడు. కానీ తొలి టెస్ట్ వికెట్ మాత్రం సాధించాడు. ఇక‌ కరాచిలో జరిగిన మూడవ టెస్టులో 33 బంతుల్లోనే 2 సిక్సర్లతో అర్థసెంచరీ చేసి భారత్ తరఫున వేగంగా హాప్‌సెంచరీ పూర్తిచేసిన క్రికెట‌ర్‌గా రికార్డు సృష్టించాడు. అనంత‌రం వెస్టీండీస్ జట్టుపై ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో 124 బంతుల్లో 126 పరుగులు సాధించి తన తొలి టెస్ట్ శతకాన్ని నమోదుచేశాడు.

ఇక‌, కుడి చేతివాటం పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్.. తన క్రీడాజీవితంలో చాలాకాలం పాటు తనే భారత జట్టు ప్రధాన బౌలర్‌గా చలామణి అయ్యాడు. 80వ ద‌శ‌కంలో ఇన్‌స్వింగ్ యార్కర్లు సందిస్తూ బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. అంతేకాదు బ్యాట్స్‌మెన్ గానూ చాలా మ్యాచ్‌ల్లోనూ జట్టుకు విజయాలు అందించాడు. 1983 ప్రపంచ కప్ జింబాబ్వేపై జరిగిన వన్డే మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌గా త‌నేంటో ప్ర‌పంచానికి తెలిసేలా చేశాడు క‌పిల్. అభిమానులు అత‌నిని ముద్దుగా హర్యానా హరికేన్ అని పిలుస్తారు.

ప్ర‌పంచంలోనే ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడైన కపిల్.. భారత్ తరపున 131 టెస్టులు ఆడి 434 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ఫార్మ‌ట్‌లో 400 వికెట్లు, 500 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 225 వన్డేలు ఆడి 253 వికెట్లు తీయ‌డంతో పాటు 3783 పరుగులు సాధించాడు. అంతేకాదు.. టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగులు మరియు 400 వికెట్లు డబుల్ ఫీట్ సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు. క‌పిల్ కెప్టెన్సీలోనే టీమిండియా మొద‌టిసారి 1983లో ప్రపంచ కప్‌ను ముద్దాడింది.

ఇక ఇత‌ని సేవ‌ల‌ను గుర్తించిన‌ విజ్డెన్.. 2002లో 20వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్‌గా గుర్తించింది. భార‌త ప్ర‌భుత్వం కూడా.. 1980లో అర్జున అవార్డు, 1982లో పద్మశ్రీ అవార్డు, 1991లో పద్మవిభూషన్ అవార్డుతో స‌త్క‌రించింది. ఇదిలావుంటే.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 1999 అక్టోబర్ నుంచి 2000 ఆగష్టు వరకు 10 మాసాల పాటు భారత జట్టుకు కోచ్‌గా కూడా వ్యవహరించాడు.

Next Story