కంగ‌నా ర‌నౌత్ 'త‌లైవి' ఫ‌స్ట్‌ లుక్‌, టీజ‌ర్ విడుద‌ల‌

By అంజి  Published on  23 Nov 2019 12:02 PM GMT
కంగ‌నా ర‌నౌత్ త‌లైవి ఫ‌స్ట్‌ లుక్‌, టీజ‌ర్ విడుద‌ల‌

తమిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత చ‌రిత్ర‌ను ఆధారంగా రూపొందుతోన్న చిత్రం 'త‌లైవి'. ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ రోల్ లో న‌టిస్తున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తోన్న ఈ సినిమాకి విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇటీవ‌ల చెన్నైలో ప్రారంభ‌మైంది.

అర‌వింద‌స్వామి ఇందులో దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంజీ రామ‌చంద్ర‌న్(ఎంజీఆర్‌) పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలాగే మ‌రో లెజెండ్రీ పొలిటీషియ‌న్, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమాలో జ‌య‌ల‌లిత‌గా న‌టిస్తోన్న కంగ‌నా ర‌నౌత్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌ను విడుదల చేశారు.

ఈ టీజ‌ర్‌లో జ‌య‌లలిత‌కు సంబంధించిన రెండు గెట‌ప్‌ల‌ను రిలీజ్ చేశారు. అందులో సూప‌ర్ స్టార్ హీరోయిన్ లుక్ ఒక‌టి కాగా.. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి పాత్ర‌కు సంబంధించిన లుక్ మ‌రొక‌టి. ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్లేడ్ ర‌న్న‌ర్‌, కెప్టెన్ మార్వెల్ త‌దిత‌ర‌ హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్ర‌ముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు. మ‌రి... జ‌య‌ల‌లిత బ‌యోపిక్ గా వ‌స్తోన్న 'త‌లైవి' ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Next Story