సుశాంత్ స్థానంలో అభిషేక్ బచ్చన్ ఉంటే ఇలాగే మాట్లాడేవారా..? జయా బచ్చన్‌కు కంగనా ప్రశ్న
By తోట వంశీ కుమార్
బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా ఉందని భోజ్‌పూరి నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ పార్లమెంట్ సమావేశాల్లో అన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఖండించారు. కొందరు చేసిన తప్పుల కారణంగా సినీ పరిశ్రమ మొత్తంపై నిందలు వేయడం సరికాదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నటులు భారత్‌లో ఉన్నారన్నారు. మీరు కూడా చిత్ర సీమతో సంబంధం ఉన్నవారేనని.. ఆహారం పెట్టిన చెయ్యిని నరుక్కుంటామా అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని జయా బచ్చన్ కోరారు.
సుశాంత్ హత్యకేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు బాలీవుడ్ కి డ్రగ్స్ లింక్ పై దర్యాప్తు చేయడం హర్షణీయమని, చాలామంది డ్రగ్స్ కి అలవాటు పడ్డారని రవి కిషన్ వ్యాఖ్యానించారు. పొరుగుదేశాల కుట్రల ఫలితంగా ఈ దేశంలోని యువత మత్తుమందులకు బానిసలవుతున్నారని కూడా ఆయన అన్నారు. పాక్ చైనా నుంచి మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని.. నేపాల్, పంజాబ్ ద్వారా దేశంలోకి వస్తున్నాయని సోమవారం నాటి పార్లమెంట్ సమావేశంలో రవికిషన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
కాగా.. జయాబచ్చన్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ మండిపడుతూ ట్వీట్ చేసింది. 'జయా జీ.. నా స్థానంలో మీ కూతురు శ్వేత, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్థానంలో మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఉంటే కూడా ఇలాగే మాట్లాడేవారా? మీ కూతురు శ్వేత టీనేజ్‌లో నాలా బాలీవుడ్‌లో దెబ్బలు తిని, డ్రగ్స్‌కు అలవాటుపడి, లైంగిక వేధింపులకు గురయితే ఇలాగే మాట్లాడతారా? సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ తరుచూ వేధింపుల గురించి ఫిర్యాదు చేసి, చివరకు ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే వ్యాఖ్యలు చేస్తారా? మాపై కూడా కాస్త దయ చూపండి' అని కంగనా ట్వీట్ చేసింది.