నిజామాబాద్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత

By అంజి  Published on  18 March 2020 3:53 AM GMT
నిజామాబాద్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కల్వకుంట్ల కవితను ఆ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. కాగా కల్వకుంట్ల కవిత నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ వేసేందుకు బయలుదేరేముందు హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలతో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మార్యద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆమె ఇవాళ మధ్యాహ్నం నామినేషన్‌ దాఖలు చేయనున్నారని సమాచారం.

షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్ల దాఖలుకు ఈ నెల 19 చివరి తేదీ. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవితనే గెలుస్తుందని, ఆమె గెలుపు లాంఛనమేనని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. అటు ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్‌, బీజేపీలు ఎన్నికల బరిలో నిలిచాయి. ఏప్రిల్‌ 7న పోలింగ్‌ నిర్వహించి 9న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత సునాయాసంగా గెలుస్తుందని పార్టీ నాయకులు అనుకుంటున్నారు.

కల్వకుంట్ల కవిత గతంలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ మెంబర్‌ కొనసాగారు. ఆ తర్వాత మళ్లీ జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అప్పటి నుంచి కవిత కాస్తా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ తాజా నిర్ణయంతో కవిత మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నారు. ముందుగా ఆమెను సీఎం కేసీఆర్‌ రాజ్యసభకు పంపిస్తారని అందరూ భావించారు. అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే పాలు పంచుకునేందుకు కవితకు అవకాశం కల్పించారు.

2015లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో ఆయనపై పార్టీ అనర్హత వేటు వేసింది. కాగా ఇప్పుడు ఈ స్థానానికి మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానానికి పదవి కాలం మరో రెండు సంవత్సరాలు ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రక్రియ చేపట్టింది. రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెడుతున్న కవితకు సీఎం కేసీఆర్‌ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా కవిత ఎన్నికైన తర్వాత ఆమెకు కేబినెట్‌ పదవి కల్పిస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి.



Next Story