కేసీఆర్ ఇంటి నుంచి మరో మంత్రి రానున్నారా..?
By సుభాష్ Published on 18 March 2020 11:11 AM GMTనిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. గురువారంతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం కూడా ముగియనుంది. ఎమ్మెల్సీ గా ఎన్నికైన తర్వాత ఆమెను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు కవితను రాజ్యసభకు పంసిస్తారని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల సీనియర్‌నేత కేశవరావును పంపించారు. ఆయనతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి కూడా అవకాశం కల్పించారు. దీంతో కవితకు మంత్రి పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో రాజ్యసభకు పంపించలేదని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది.
కాగా, ఎమ్మెల్సీ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కవిత తప్పకుండా గెలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2015లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొంది, కాంగ్రెస్ పార్టీలో చేరిన భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం 2022, జనవరి 4వరకు ఉండటంతో ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రక్రియ చేపట్టింది. ఏదిఏమైనా కేసీఆర్ జట్టులో కవితకు చోటు కల్పిస్తారనే వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.