ధోనికి బిర్యానీ పెట్ట‌లే.. అందుకే జ‌ట్టులో చోటు ద‌క్క‌లే : మ‌హ్మ‌ద్ కైఫ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2020 3:31 PM IST
ధోనికి బిర్యానీ పెట్ట‌లే.. అందుకే జ‌ట్టులో చోటు ద‌క్క‌లే : మ‌హ్మ‌ద్ కైఫ్

ఓ సారి టీమ్ఇండియా ఆట‌గాళ్లు త‌న ఇంటికి వ‌చ్చార‌ని, ఆసమ‌యంలో భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనికి బిర్యానీ స‌రిగ్గా వ‌డ్డించ‌లేద‌ని.. త‌న మ‌ళ్లీ జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వ‌క‌పోవ‌డానికి ఇది ఓ కార‌ణం కావ‌చ్చున‌ని భార‌త మాజీ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ కైఫ్ స‌ర‌ద‌గా అన్నాడు.

క‌రోనా కార‌ణంగా క్రికెట్‌కు సంబంధించిన కార్య‌క‌లాపాలు ప్ర‌స్తుతం ఏమీ జ‌ర‌గ‌డం లేదు. దీంతో ఆట‌గాళ్లంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. మ‌హ్మ‌ద్ కైప్ ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కాలాన్ని కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుతూ..హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానుల‌తో స‌ర‌దాగా ముచ్చ‌డిస్తున్నాడు.

ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్న కైఫ్.. భార‌త జ‌ట్టును త‌న ఇంటికి డిన్న‌ర్‌కు ఆహ్వానించిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నాడు. 2006లో నోయిడాలోని త‌న ఇంటికి భారత జ‌ట్టు ఆట‌గాళ్ల‌ను ఆహ్వానించాన‌ని, అప్ప‌టి కోచ్ గ్రెగ్ చాపెల్‌తో పాటు స‌చిన్‌, గంగూలీ వంటి సీనియ‌ర్ ఆట‌గాళ్లు రావడంతో వారికి ఎలా మ‌ర్యాద‌లు చేయాలో తెలియ‌క కొంత ఇబ్బంది పడ్డాన‌ని చెప్పాడు కైప్‌. సీనియ‌ర్ ఆట‌గాళ్లు, జూనియ‌ర్ ఆట‌గాళ్లు వేర్వేర్ గ‌దుల్లో కూర్చోన్నారు. నేను సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌తోనే ఎక్కువ స‌మ‌యం గ‌డిపా. నిజం చెప్పాలంటే జూనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు స‌రిగా బిర్యానీ కూడా వ‌డ్డించ‌లేక‌పోయాన‌ని చెప్పుకొచ్చాడు ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌.

అప్పుటి జూనియ‌ర్ ఆట‌గాళ్లు ధోని, సురేష్ రైనా ల‌ను ప‌ట్టించుకోని విష‌యం ఇంకా గుర్తు ఉంది. ఇక ధోనిని క‌లిసిన‌ప్పుడెల్లా ఇదే విష‌యాన్ని గుర్తు చేస్తూ త‌న‌ను ఆట‌ప‌ట్టిస్తాడ‌ని తెలిపాడు. ఒక‌వేళ ఆరోజు ధోనికి బిర్యానీ క‌నుక స‌రిగ్గా వ‌డ్డించిన‌ట్లైయితే.. మ‌ళ్లీ టీమ్ లో రీఎంట్రీ ఇచ్చేవాడిన‌ని అన్నాడు. ‘తనను గౌరవంగా చూడలేదని మహీ భావించి ఉంటాడు. ఇదే నేను మళ్లీ జట్టులోకి రాకపోవడానికి కారణమై ఉండొచ్చు. ఈ విషయాన్ని ధోనీ అప్పుడప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాడ’ని కైఫ్‌ నవ్వుతూ చెప్పాడు. టీమ్ఇండియా త‌రుపున 2006లో చివ‌రిసారిగా ఆడాడు కైప్‌. 2018లో క్రికెట్ నుంచి వీడ్కోలు ప‌లికాడు. ఇక 2007లో మ‌హేంధ్ర‌సింగ్ ధోని కెప్టెన్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే.

Next Story