ప్రముఖ సాక్సోఫోన్ విద్వాంసులు, పద్మశ్రీ కదిరి గోపాల్‌నాథ్ (69) కన్నుముశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న గోపాల్‌నాథ్‌ను కుటుంబ సభ్యులు అక్టోబర్ 10న మంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున 4.45 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు. కర్నాటక సంగీతానికి మార్గదర్శకులలో గోపాల్‌నాథ్ ఒకరు. 1994లో లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్‌హాల్‌లో జరిగిన బిబిసీ ప్రోమెనేడ్ సంగీత కచేరీకి ఆహ్వానం పొందిన మొదటి సంగీత కళాకారులు గోపాల్‌నాథ్‌. 1949 డిసెంబర్ 6న దక్షిణ కర్నాటకలోని ఓ మారుమూల గ్రామంలో గోపాల్‌నాథ్ జన్మించారు.

ఈయన మంగళూరు ప్రాంతానికి చెందిన వారు అయినప్పటికీ చైన్నైని తన కర్మ భూమిగా చెప్పేవారు. భారతదేశంలోనే కాక యూరప్, యునైటెడ్ స్టేట్స్‌, కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంక, పశ్చిమ ఆసియాతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల గోపాల్‌నాథ్‌ ప్రదర్శనలు ఇచ్చారు. మంగళూరు, బెంగళూరు విశ్వవిద్యాలయాలు గోపాల్‌నాథ్‌కు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు తో పాటు ఇతర ఎన్నో అవార్డులు గోపాలనాథ్‌ వద్దకు చేరి తమ విలువను పెంచుకున్నాయి.

గోపాల్‌నాథ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కన్నడ సంగీత దర్శకుడు మణికాంత్ ఈయన కుమారుడే. మణికాంత్ తెలుగులో మోసగాళ్లకు మోసగాడు, ఆవకాయ బిర్యాని మొదలగు సినిమాలకు సంగీత దర్శకత్వం చేసారు. గోపాల్‌నాథ్‌ మృతికి సంగీత దర్శకులు ఏ ఆర్ రెహమాన్, దేవి శ్రీ ప్రసాద్ తో పాటు పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.