అసాంజే ఆరోగ్యంపై ఆందోళన.. అతడు జైలులోనే చనిపోవచ్చట.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Nov 2019 5:32 AM GMTవికీలీక్స్ సహవ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే కు చికిత్స అవసరమని వైద్య బృందం చెబుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అసాంజే అనారోగ్యంతో జైలులోనే చనిపోవచ్చని సుమారు 60 మంది వైద్యులు బ్రిటన్ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. 48 ఏళ్ల అసాంజే గూడాచర్యం చర్య కింద ప్రస్తుతం బ్రిటన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
అతన్ని అమెరికాకు తరలిస్తే సుమారు 175 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన కీలక మరియు అత్యంత రహస్యమైన దస్త్రాలను అసాంజే బహిర్గతం చేశారు. అమెరికా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో ఏ విధముగా జోక్యం చేసుకుంటోందో వివరంగా ఉంది. కీలక సమాచారాన్ని బయటపెట్టిన అసాంజే పై అమెరికా కక్ష పెట్టుకుంది. అతనిని అప్పగించాలని పలుమార్లు వివరణ కోరింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ పదహారు పేజీల బహిరంగ లేఖ రాసినట్టు వైద్యులు వెల్లడించారు.
ఈ లేఖను సమర్పించిన వైద్యులు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, శ్రీలంక తదితర దేశాలకు చెందిన వారు. వైద్యులు బ్రిటన్ అంతర్గత మంత్రి హోంశాఖ కార్యదర్శి కి రాసిన ఈ లేఖలో అసాంజేను లండన్ లోని జైలు నుంచి యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించాలని కోరారు. అక్టోబర్ 21న అతనిని కోర్టులో హాజరుపరచగా అతనిని తీసుకు వచ్చిన సమయంలో అసాంజే చాలా నీరసంగా కనిపించాడని, తిరిగి నవంబర్ 1 నివేదికను పరిశీలించిన అప్పుడు అతను మానసిక సంఘర్షణకు గురవుతున్నట్లు గా అనిపించింది అన్నారు.
ఇలాగే జరిగితే అతడు జైలులోనే చనిపోయే అవకాశం ఉన్నట్లు వారు వివరించారు. కనీసం అతని పుట్టిన తేదీని గుర్తుకు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు అంటే అతను ఎలాంటి మానసిక క్షోభను అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవాలని వారు తమ లేఖలో పేర్కొన్నారు.