రాయల్స్‌కు షాకిచ్చిన జోప్రా ఆర్చర్
By Newsmeter.Network
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ కు ముందే రాజస్థాన్ రాయల్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. రెండు సీజన్ల నుంచి రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఇంగ్లాండ్ పేసర్ జోప్రా ఆర్చర్ ఐపీఎల్-13 సీజన్ కు దూరమయ్యాడు. మోచేతి గాయంతో బాధపడుతున్న జోప్రా.. మూడు నెలలు క్రికెట్ కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో ఐపీఎల్ ఈ సీజన్ కు అందుబాటులో ఉండ నని ప్రకటించాడు ఈ రాయల్స్ ఆటగాడు.
ఇంగ్లాండ్ టీమ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండగా.. ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడిన జోప్రా ఆర్చర్ ఆ తర్వాత గాయంతో టీమ్‌కి దూరమయ్యాడు. గాయం తీవ్రతను పరిశీలించిన వైద్యులు గాయం మానడానికి మూడు నెలల సమయం పడుతుందని తెలిపారు. దీంతో ఆర్చర్ తిరిగి జూన్ లోనే క్రికెట్ ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. 2018లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆర్చర్.. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ సీజన్‌లో 15 వికెట్లతో రాణించిన ఆర్చర్.. 2019 సీజన్‌లో 11 వికెట్లతో మెరిశాడు. డెత్ ఓవర్లలోనూ పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఎంతలా అంటే..? గత ఏడాది ఐపీఎల్‌లో అతని బౌలింగ్ ఎకానమీ ఓవర్‌కి 6.76గా ఉంది.
దీంతో అతను ఈ ఏడాది ఐపీఎల్‌కి దూరమవడం.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.ఈ సీజన్ ఐపీఎల్ మార్చి 29వ తేదీ నుంచి ఆరంభం కానుంది.