జియో వినియోగదారులకు గుడ్‌న్యూస్.. రీచార్జ్ చేస్తే కమీషన్
By తోట వంశీ కుమార్ Published on 10 April 2020 6:08 PM ISTటెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది రిలయన్స్ జియో. జియో రాకతో ముఖ్యంగా డేటా రేట్లు భారీగా పడిపోయాయి. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ మంది కస్టమర్లలను జియో సొంతం చేసుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీసులను తన కస్టమర్లకు అందిస్తోంది. తాజాగా మరో సరీస్వును అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో పీఓఎస్ లైట్ పేరిట ఓ యాప్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా ఇతర జియో నెంబర్లకు రీచార్జ్ చేయవచ్చు. రీచార్జ్ చేసిన ప్రతిసారీ 4.16శాతం కమీషన్ లభించనుంది. ఇక ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతుంది. ఎవరైనా సరే డౌన్‌లోడ్ చేసుకుని ఇతర జియో నెంబర్లకు రీచార్జ్ చేయవచ్చు.
ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా చాలా సులభం. ఎటువంటి పత్రాలను సమర్పించాల్సిన పని లేదు. వ్యాలెట్ లోకి రూ.500,రూ.1000 నగదు బదిలీ చేసుకోవాలి. తరువాత రీచార్జ్‌కు సంబంధించిన ప్లాన్లను చూపెడుతుంది. ప్రతి 20 రోజులకొకసారి పాస్‌బుక్‌లో కమీషన్ ను చెక్ చేసుకోవచ్చు.
మై జియో యాప్, జియో వెబ్సైట్ ను ఉపయోగించి రీచార్జ్ చేసుకునే సౌలభ్యం ఉన్నప్పటికి అందులోంచి రీచార్జ్ చేసుకుంటే కమీషన్ రాదు. ప్రస్తుత యాప్ ఎంతో ఉపయోగపడనుంది. ప్రస్తుతం దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో రీచార్జ్ చేయడంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది.