నెల నిండని జార్ఖండ్ సర్కారుకు నూరేళ్లు నిండుతాయా?

By రాణి  Published on  25 Jan 2020 11:34 AM GMT
నెల నిండని జార్ఖండ్ సర్కారుకు నూరేళ్లు నిండుతాయా?

జార్ఖండ్ లో ప్రభుత్వం పుట్టి ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు. అప్పుడే బాలారిష్టాలు మొదలయ్యాయి. నెల రోజుల క్రితం జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో చేరిన జార్ఖండ్ వికాస్ మోర్చా ఉన్నట్టుండి కూటమి నుంచి బయటకు వచ్చేసింది. అంతే కాదు. ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు మద్దతును ఉపసంహరించుకుంది. ఇంతకీ కారణం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని చీల్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేత ఒక లేఖ ద్వారా హేమంత్ సోరేన్ కు తెలియచేశరు.

‘మీ నాయకత్వానికి ఎలాంటి షరతూ లేకుండా మద్దతు ఇస్తూ మా పార్టీ అయిన జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా డిసెంబర్‌ 24, 2019న లేఖ ఇచ్చింది. కానీ మన కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ మా ఎమ్మెల్యేలను జేవీఎంను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు శనివారం నాటి దినపత్రికలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో మీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాం” అని ఆ పార్టీ అధ్యక్షులు బాబులాల్‌ మారాండీ తెలియచేశారు, శనివారం నాటి పత్రికా కథనాల ప్రకారం జార్ఖండ్ వికాస్ మోర్చా ఎమ్మెల్యేలైన ప్రదీప్‌ యాదవ్‌, బంధు టిక్రీలు సోనియా గాంధీని ఢిల్లీలో కలిశారు. దీంతో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఊహాగానాలు చెలరేగాయి. ఇదిలా వుండగా ఆ ఎమ్మెల్యేలు ఇద్దరూ రాహుల్‌ గాంధీని, జార్ఖండ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఆర్పీఎన్‌ సింగ్‌లను కూడా కలిశారు.

జేవీఎం కు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఇద్దరు వెళ్లిపోతే అది పార్టీ ఫిరాయింపు కిందకు రాదు. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ వికాస్ మోర్చా అధినేత బాబులాల్ మరాండీ మద్దతును ఉపసంహరించుకున్నారు. అయితే దీని వల్ల ప్రభుత్వానికి పెద్దగా ముప్పు ఉండబోదని తెలుస్తోంది.

Next Story