సుత్తితో కొట్టి, కత్తితో పొడిచి అత్యంత దారుణంగా.. కుటుంబసభ్యులు అంద‌రినీ..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Feb 2020 2:32 PM GMT
సుత్తితో కొట్టి, కత్తితో పొడిచి అత్యంత దారుణంగా.. కుటుంబసభ్యులు అంద‌రినీ..

అత‌డో పోలీస్‌ కానిస్టేబుల్‌. కానీ తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి కుటుంబసభ్యుల్ని దారుణంగా హ‌త్య చేశాడు. సుత్తితో కొట్టి, అత్యంత పాశ‌వికంగా హంత‌మొందించాడు. ఈ దారుణ ఘ‌ట‌న‌ జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో శనివారం జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. రాంచీకి చెందిన బ్రిజేశ్‌ తివారీ కానిస్టేబుల్‌. న‌గ‌రంలోని ఓ అద్దె ఇంట్లో భార్య, కొడుకు, కూతరుతో కలిసి నివసిస్తున్నాడు.

అయితే.. శనివారం ఫుల్లుగా మద్యం తాగిన‌ బ్రిజేశ్‌.. తాగిన మైకంలో భార్య‌, కొడుకు, కూతురిని సుత్తితో కొట్టి, కత్తితో పొడిచి దారుణంగా మ‌ట్టుబెట్టాడు. వారిని హ‌త్య చేసిన‌ అనంతరం పండారాలో నివాసముంటున్న‌ తన సోదరికి ఫోన్‌ చేసి ‘ నేను ఆ ముగ్గుర్ని చంపేశాను’ అంటూ తెలిపాడు. ఆ తర్వాత బ్రిజేశ్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

బ్రిజేశ్ ఫోన్‌తో కంగారు పడ్డ అత‌ని సోదరి సంఘటనా స్థలానికి చేరుకుని చూడ‌గా.. బ్రిజేశ్ చేతిలో తీవ్ర గాయాల పాలైన‌ ఆ ముగ్గురు అప్ప‌టికే విగ‌తజీవులై ప‌డివున్నారు. ఇంటి యాజమాని సహాయంతో ఆపస్మారక స్థితిలో ఉన్న బ్రిజేశ్ ను ద‌గ్గ‌ర్లోని ఆసుప‌త్రికి తరలించారు. ప్రస్తుతం బ్రిజేశ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

స్థానికుల క‌థ‌నాల‌ ప్ర‌కారం.. బ్రిజేశ్ కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉందని.. ఇది పరువు హత్య అనే ప్ర‌చారం జ‌రుగుతుంది. సంఘటనా స్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు.. అక్క‌డ‌ మద్యం సీసా, ఎలుకల మందు ప్యాకెట్‌ను గుర్తించారు. హ‌త్య‌కు గ‌ల కార‌ణాలేంటి అనే కోణంలో పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it