రచ్చ అయ్యాక వివరణ ఇచ్చుకున్న జీవితమ్మ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 6:49 AM GMT
రచ్చ అయ్యాక వివరణ ఇచ్చుకున్న జీవితమ్మ..!

ఈనెల 20వ తేదీ తెలుగు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) జనరల్‌ ఆత్మీయ సమావేశం నిర్మాతల మండలి హాలులో జరిగింది. దీనిపై పలు మాధ్యమాల్లో రకరకాలుగా వార్తలు వచ్చాయి. నటుడు నరేశ్‌ అధ్యక్షుడిగా, డా. రాజశేఖర్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జనరల్‌ కార్యదర్శిగా జీవిత రాజశేఖర్‌ 'మా' బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా వుండగా 'మా' సమావేశానికి సంబంధించిన వివరాలను జీవిత రాజశేఖర్‌ సోమవారం నాడు వివరణ ఇచ్చారు. ఆదివారంనాడు జరిగిన సమావేశాన్ని ఆత్మీయ సమ్మేళనం, ఆంతరంగిక సమ్మేళం, 'మా' సమావేశం ఏదైనా అనుకోవచ్చన్నారు. ఈ సమావేశానికి దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారు. వారందకిరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆదివారం నాడు జరిగిన సమావేశ వివరాలను 'మా' కార్యవర్గం ఆమోదం మేరకు తెలియజేస్తున్నా. అయితే కొందరు సభ్యులు రాలేకపోయారు. అందుకే వారికి ఆరోజు ఏం జరిగిందనేది తెలియాల్సిన అవసరం ఉందని జీవిత రాజశేఖర్‌ అన్నారు.

ఆదివారం ఉదయం 9గంటల నుంచి సాయత్రం 5.30 గంటల వరకు సమావేశం జరిగింది. ముఖ్యంగా 26 మంది కమిటీ సభ్యుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. వాటిని మేం పరిష్కరించుకోలేకపోయాం. దానికి కొన్ని కారణాలూవున్నాయి. ఈ క్రమంలో వాదోపవాదాలు కూడా చోటుచేసుకున్నాయని జీవిత రాజశేఖర్‌ తెలిపారు. ఏదిఏమైనా ఉపయోకరమైన సమావేశం అని గట్టిగా చెప్పగలనని అన్నారు. మెజారిటీ సభ్యులు అత్యవసరంగా 'ఎక్స్‌ట్రాడ్‌నరీ జనరల్‌బాడీ మీటింగ్‌' పెట్టుకోవాలని సూచనలు చేశారు. దానికి సంబంధించిన బైలా ప్రకారం ఏం చేయాలనేది పరిశీలించామన్నారు.

ఆత్మీయ సమావేశంలో 'మా' లాయర్‌ గోకుల్‌, కోర్టులో కేసు వేసిన వరప్రసాద్‌ కూడా ఉన్నారని జీవిత పేర్కొన్నారు. అందరూ కలిసి ఎక్స్‌ట్రాడినరీ జనరల్‌బాడీ మీటింగ్‌ జరగాలని అనుకోవడం జరిగింది. 'మా' సభ్యుల్లో 900పైగా వున్నారు. అందులో 20శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపితే ఎక్స్‌ట్రాడినరీ జనరల్‌బాడీ జరుగుతుంది. అప్పుడే 'మా' సమస్యలు పరిక్షరించుకోవడానికి అవకాశం వుంటుంది. 20శాతం సభ్యులు ఆమోదం తెలిపితే అప్పటినుంచి 21 రోజుల్లోగా మీటింగ్‌ పెట్టుకోవాల్సివుంటుంది. ఇలా మీటింగ్‌ జరిగితేనే అందరికీ మంచి జరుగుతుందని జీవిత చెప్పుకొచ్చారు. సమస్యలు పరిష్కారం కావాలని కోరుకునే సభ్యులందరూ 'మా' ఆఫీసుకు రావడానికి సాధ్యం కాకపోతే ఈమెయిల్‌ ద్వారానో, పోస్ట్‌ ద్వారానో, ఆఫీసుకు వచ్చే వీలున్నవారు వచ్చి సంతకాలతో ఆమోదం తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని' జీవిత రాజశేఖర్‌ తెలిపారు.

Next Story
Share it