నిఘాలో జేఈఈ పరీక్షలు.. సీసీ కెమెరాలు, జామర్లు ఏర్పాటు

By Newsmeter.Network  Published on  5 Jan 2020 5:47 AM GMT
నిఘాలో జేఈఈ పరీక్షలు.. సీసీ కెమెరాలు, జామర్లు ఏర్పాటు

హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ పరీక్షకు సంబంధించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఎజెన్సీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు జేఈఈ పరీక్షలు జరగనున్నాయి. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి దాదాపు 75 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మార్పు చేసిన క్వశ్చన్‌ పేపర్స్‌తో మొదటిసారిగా పరీక్షలను నిర్వహించేందుకే ఎన్‌టీఏ సిద్ధమైంది. పరీక్ష కేంద్రాల్లోనే పెన్నులు, పెన్సిళ్లు, రఫ్‌ వర్క్‌ కోసం తెల్లకాగితాలు అందించనున్నారు. అభ్యర్థులు కేవలం అడ్మిట్‌ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో, గుర్తింపు కార్డు మాత్రమే తెచ్చుకోవాలని ఎన్‌టీఏ ఈ మేరకు ప్రకటించింది. పరీక్ష కేంద్రాల్లో అధికారులు సీసీ కెమెరాలతో పాటు జామర్లను ఏర్పాటు చేశారు.

ఏపీ, తెలంగాణలో మొత్తం కలిపి లక్షా 50 వేల మమంది పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా పరీక్ష కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్‌ ఫోన్లు తీసుకురావద్దని ఎన్‌టీఏ విద్యార్థులకు సూచించింది. విద్యార్థుల పరీక్షల కోసం అన్ని రకాల వసతులను అధికారులు ఏర్పాటు చేశారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ పరీక్షలు కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు. పరీక్ష సమయానికి అరగంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఒక్కసారి పరీక్ష కేంద్రం గేట్‌ మూసివేశాక ఎట్టిపరిస్థితుల్లో తెరిచేది లేదని అధికారులు తెలిపారు. వరంగల్‌, సికింద్రాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండలో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పరీక్షా సమయం..

పరీక్షలను ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటలకు మొదలై మధ్యాహ్నం 12.30 వరకు, అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. కాగా ఒక గంట ముందు నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్షలు ఫలితాలు ఈ నెల చివరి వారంలో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. 300 మార్కులకు గాను 75 ప్రశ్నలతో పరీక్ష నిర్వహించనున్నారు. ఫిజిక్స్‌లో 25, కెమిస్ట్రీలో 25, మ్యాథ్స్‌లో 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్‌లో 20 ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌, ఐదు న్యుమరికల్‌ ప్రశ్నలు ఉంటాయి. న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నల్లో నెగిటివ్‌ మార్కులు ఉంటాయి.

Next Story