ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు తన సొంత పార్టీ నుంచే భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీహార్ సీం, జేడీయు అధ్యక్షుడు నితీష్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌ మధ్య జరుగుతున్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ప్రశాంత్‌ కిశోర్‌ను జేడీయూ నుంచి బహిష్కరించేందుకు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రశాంత్‌ కిశోర్‌తో పాటు జేడీయూ అధికార ప్రతినిధి పవన్‌ వర్మను సైతం పార్టీ నుంచి బహిష్కరించారు. వీరిద్దరి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జేడీయూ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా జేడీయూలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటున్న పార్టీ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ బహిరంగ విమర్శలకు దిగారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని, పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రశాంత్‌ కిశోర్‌ వ్యతిరేకించడంతో ఈ వివాదం మొదలైంది.

వివాదానికి దారి తీసిందిలా..

పౌరసత్వం సవరణ చట్టం బిల్లును ప్రశాంత్ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత నవంబర్‌లో జరిగిన పార్లమెంట్‌ ఉభయ సభల్లో సీఏఏ చట్టానికి జేడీయు మద్దతు ఇవ్వడంపై ప్రశాంత్‌ కిశోర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలని ప్రశాంత్‌ కిశోర్‌ ప్రకటన కూడా చేశారు. ఇలా వివాదం ముదురుతూ వచ్చింది. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సూచనల మేరకు ప్రశాంత్‌ కిశోర్‌ను జేడీయులోకి తీసుకున్నామని సీఎం వ్యాఖ్యనించారు. ”ఎవరైనా నాకు లేఖ రాస్తే నేను సమాధానం ఇస్తాను. ఎవరైన ట్విట్ చేస్తే చేసుకోనివ్వండి.. ఎవరైనా పార్టీలో ఉండాలనుకుంటే ఉండొచ్చు.. ఆయనను పార్టీలోకి తీసుకోవాలని అమిత్‌ షా నన్ను అడిగారు’ అని నితీష్‌ పేర్కొన్నారు. దీనిపై ప్రశాంత్‌ కిశోర్‌ ధీటుగా స్పందించారు. ”అమిత్‌షా ఎవరైనా వ్యక్తిని సిఫారసు చేస్తే తిరస్కరించే ధైర్యం మీకు లేదని చెప్పదలుచుకున్నారా..?” అంటూ ట్విట్‌ లో ప్రశాంత్‌ కిశోర్‌ నిలదీశారు. ఇలా వీరిద్దరి మధ్య జరిగిన వివాదం తారాస్థాయికి చేరాయి. ఇలా జరిగిన వివాదం తారాస్థాయికి చేరడంతో చివరకు ప్రశాంత్‌ కిశోర్‌ను బహిష్కరిస్తున్నట్లు జేడీయూ ప్రకటించింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.