జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో హైకోర్ట్ జోక్యం

By రాణి  Published on  28 Jan 2020 11:13 AM GMT
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో హైకోర్ట్ జోక్యం

ముఖ్యాంశాలు

  • జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో పేరుకుపోయిన చెత్త
  • టన్నుల కొద్దీ ఉన్న చెత్తవల్ల స్థానికులకు ఇబ్బందులు
  • హైకోర్ట్ కి లేఖ రాసిన కల్నల్ సీతారామరాజు
  • ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్ట్
  • చెత్త తొలగింపులో పురోగతిని నివేదించాలని ఆదేశాలు
  • విచారణకు హాజరైన జి.హెచ్.ఎమ్.సి కమిషనర్

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ని శుభ్రం చేసే విషయంలో ప్రోగ్రెస్ ని వారానికోసారి నివేదించాలంటూ తెలంగాణ హైకోర్ట్ జి.హెచ్.ఎం.సి కమిషనర్ లోకేష్ కుమార్ కి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలతో కూడిన అఫిడవిట్ ను వెంటనే సమర్పించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కోరింది. మేడ్చల్ లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల తీవ్రస్థాయిలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వెంటనే డంపింగ్ యార్డ్ నుంచి చెత్తను తరలించాలని హైకోర్ట్ ధర్మాసనం జి.హెచ్.ఎం.సికి ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు నగరంలోని చెరువుల ఆక్రమణలను తొలగించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి కూడా వారానికోసారి జి.హెచ్.ఎం.సి వివరాలు సమర్పించాలని హైకోర్ట్ బెంచ్ ఆదేశించింది.

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలకు సమస్యలు ఎదురువుతున్నాయనీ, దాన్ని వెంటనే అక్కడి నుంచి తొలగించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జి.హెచ్.ఎం.సి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కల్నల్ సీతారామరాజు రాసిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్ట్ జి.ఎహ్.ఎమ్.సి కమిషనర్ లోకేష్ కుమార్ ని విచారణకు హాజరై వివరాలు తెలపాలంటూ ఆదేశించింది.

ఇంతకు ముందే జి.హెచ్.ఎం.సి దాదాపు 5,000 మెట్రిక్ టన్నుల చెత్తని ఇక్కడ్నుంచి వేరే చోటికి తరలించింది. కానీ తర్వాత ఆ తరలింపు ప్రక్రియ మళ్లీ మూలపడింది. దాంతో స్థానికులు పూర్తిగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి చెత్తని తొలగించాలంటూ ఒత్తిడి చేశారు. కానీ ప్రత్యామ్నాయంగా జి.హెచ్.ఎం.సి ఎంపిక చేసుకున్న మూడు ప్రాంతాల్లోని ప్రజలు చెత్తని తమ ప్రాంతంలో వెయ్యడానికి వీల్లేదని ఆభ్యంతరం వ్యక్తం చేయడంతో జవహర్ నగర్ యార్డ్ నుంచి చెత్తని తొలగించే ప్రక్రియ అర్థంతరంగా ఆగిపోయింది.

కాంక్రీట్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయండి

అసలు జవహర్ నగర్ యార్డ్ నుంచి చెత్తను పూర్తిగా తొలగించేందుకు ఏం ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాలంటూ హైకోర్ట్ బెంచ్ జి.హెచ్.ఎం.సి కమిషనర్ ని కోరింది. 337 ఎకరాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ ని 2012లో 137 ఎకరాలకు కుదించడం జరిగిందని, చెత్తను కవర్ చేయడానికి చుట్టూ భారీ పోలీ ఎథిలీన్ షీట్లతో పరదాలను ఏర్పాటు చేశామనీ, దానివల్ల చెత్తనుంచి వచ్చే దుర్గంధంవల్ల చుట్టుపక్కలవాళ్లకు ఇబ్బంది ఉండదనీ జి.హెచ్.ఎం.సి కమిషనర్ కోర్టుకు విన్నవించారు. దీంతో పాటుగా రెండు గార్బేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కమిషనర్ కోర్టుకు తెలిపారు. ఆయన వివరణను విన్న న్యాయస్థానం చెత్తను డంప్ చేసే ప్రదేశంలో నేలపై కాంక్రీట్ ఉండేలా పెద్ద ప్లాట్ ఫామ్ ని ఏర్పాటు చేయాలని, దానివల్ల చెత్తలో నుంచి కిందికి కారిన వ్యర్థాలు భూమిలోకి చేరి నీరు కాలుష్యం కాకుండా ఉంటుందని సూచించింది. ముందు అక్కడ ఉన్న చెత్తను పూర్తిగా తొలగించిన తర్వాత గానీ అక్కడ కాంక్రీట్ ప్లాట్ ఫామ్ ని ఏర్పాటు చేయడం కుదరదని కమిషనర్ న్యాయస్థానానికి విన్నవించినట్టుగా తెలుస్తోంది. అదే విధంగా జంటనగరాల్లోని చెరువులు, చిన్న నీటి వనరులు ఆక్రమణలకు గురికాకుండా చూసేందుకు, ఇప్పటికే జరిగిన ఆక్రమణలను తొలగించేందుకు జి.హెచ్.ఎం.సి ఏ చర్యలు తీసుకుంటోందో ప్రత్యేకమైన అఫిడవిట్ ని సమర్పించాలని న్యాయస్థానం జి.హెచ్.ఎం.సి కమిషనర్ ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి ఏడో తేదీకి వాయిదా పడింది.

Next Story