అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని పవన్‌ కల్యాణ్‌ సందర్శించనున్నారు. అమర సైనికు వీరుల కుటుంబ సంక్షేమానికి ప్రకటించిన రూ.1 కోటి చెక్కును ఆయన సైనికాధికారులకు అందజేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన్‌భవన్‌లో జరిగే ఇండియన్‌ స్టూడెంట్స్‌ పార్లమెంట్‌ సదస్సులో పాల్గొని పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించనున్నారు. దేశానికి స్వచ్ఛమైన యువరాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పవన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

విద్యార్థుల సందేహాలకు పవన్‌ సమాధానాలు ఇస్తారు. ఈ కార్యక్రమంలో పవన్‌ కల్యాణపై రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి ఇటీవల మిలటరీ డే సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మేఘాలయ అసెంబ్లీ స్పీకర్‌ మెత్బా లింగ్డో అధ్యక్షత వహిస్తారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ సదస్సులో ప్రసంగిస్తారు.

ఇదిలా ఉంటే.. కర్నూలులో సంచలనం రేపిన సుగాలి ప్రీతి హత్యాచారం కేసును సీబీఐ అప్పగిస్తామని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పవన్‌ కల్యాణ్‌ స్వాగతించారు. సీఎం జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఆ బాధిత కుటుంబానికి ఒకింత ఊరటనిస్తుందన్నారు. సీబీఐ విచారణను వేగవంతం చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని పవన్‌ కోరారు. పాఠశాలకు వెళ్లిన చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఉసురు తీసినవాళ్లని కఠినంగా శిక్షించాలని కర్నూలు నగరంలో లక్షల మంది ప్రజలు నినదించారు. ప్రభుత్వంలో కదలిక వచ్చేలా సుగాలీ ప్రీతి కుటుంబం వెన్నంటి ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు.

అంజి

Next Story