జనసేన శ్రేణులకు గుడ్ న్యూస్..!
By Newsmeter.Network Published on 27 Dec 2019 8:36 PM ISTవిశాఖపట్నం వైసీపీ శ్రేణులు ప్రస్తుతం ఓ సూత్రాన్ని పాటించేందుకు సిద్ధమయ్యారంటూ రాజకీయ వర్గాల్లో విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ సూత్రమేమిటయ్యా..? అంటే, కీడెంచి.. మేలెంచు. కాగా, ఈ దఫా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151, టీడీపీ 23 సీట్లను గెలుపొందగా, జనసేన ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక విశాఖలోనూ వైసీపీ హవానే కొనసాగింది. 15 స్థానాలు ఉన్న ఈ జిల్లాలో 11 వైసీపీ, 4 టీడీపీ కైవసం చేసుకున్నాయి. ఈ ప్రభంజనాన్నే త్వరలో జరగనున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ రిపీట్ చెయ్యాలని వైసీపీ భావిస్తోంది.
ఈ తరుణంలో వైసీపీ శ్రేణుల స్వరానికి భిన్నంగా రాజకీయ విశ్లేషకుల నుంచి మరో మాట వినిపిస్తోంది. వారు అనుకుంటున్నట్టు జీవీఎంసీ ఎన్నికల్లో ప్రభంజనం అంత ఈజీ కాదన్న సూచనలను చేస్తున్నారు. దీనికంతటికి కారణం ఇటీవల కాలంలో ఏపీలో వచ్చిన రాజకీయ మార్పులే కారణమని చెప్పుకొస్తున్నారు. ఇంతకీ ఆ మార్పులేంటి..? వైసీపీకి రాజకీయ విశ్లేషకులు చేస్తున్న హెచ్చరికలేంటి..? అన్న ప్రశ్నలకు సమాధానం వారి విశ్లేషణల్లోనే ఇలా ఉంది.
తట్టమోస్తే కానీ కడుపు నిండని బతుకులు
గత వారం వరకు భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత కారణంగా ఉపాధిలేక రోడ్డున పడ్డ దుస్థితిని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. తట్టమోస్తే కానీ.. కడుపు నిండని బతుకులు మావి. అటువంటిది మా కడుపు కొడతావా..? ఇలా ఇసుక కొరతకు ప్రధాన కారణం జగన్ సర్కారేనని విమర్శిస్తూ కార్మికులు తిట్లదండకం వినిపించారు కూడాను. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అంతటితో ఆగని వారు నిన్ను నమ్మి వైసీపీకి ఓట్లేసినందుకేనా.. మమ్మల్ని రోడ్డుపాలు చేశావు..? అంటూ సీఎం జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏదేమైనా దాదాపు ఆరు నెలలపాటు ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని చెప్పక తప్పదు. కేవలం భ.ని. కార్మికులే కాకుండా నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కొన్ని పరిశ్రమలు సైతం తీవ్ర నష్టాలబాటపట్టాయి.
ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నెలలకే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడటంతో అధికార వైసీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఆందోళనబాట పట్టాయి. కార్మికుల సమస్యలపై గళమెత్తాయి. ఇదే సమయంలో ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసినా ఆత్మస్థైర్యంతో ముందుకెళుతున్న జనసేన కార్మికుల కోసం వినూత్న కార్యక్రమాలు నిర్వహించింది.
కార్మికుల కోసం ఏకంగా జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణే రంగంలోకి దిగారు. విశాఖ నడిబొడ్డు జగన్ సర్కార్ పాలనలో ఏర్పడ్డ ఇసుక కొరత సమస్యను ప్రశ్నిస్తూ, కార్మికులతో కలిసి లాంగ్‌మార్చ్ నిర్వహించింది జనసేన. ఆ పార్టీ ముఖ్యనేతలతో కలిసి బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు పలికిన వైనం విధితమే. ఇలా కార్మికుల పక్షాన విధిగా పోరాడిన పార్టీగా జనసేన ఇమేజ్ అమాంతం పెరిగింది. విశాఖ ప్రజల్లోనూ జనసేన పరపతి పెరిగిందనిన్న భావన ఏర్పడిందని, ఈ అంశం త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో జనసేనకు పట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.