వారికి మద్దతుగా జనసేన భారీ ర్యాలీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2019 10:54 AM GMT
వారికి మద్దతుగా జనసేన భారీ ర్యాలీ

హైదరాబాద్‌: జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఆదివారం రోజున సమావేశమయ్యింది. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్‌, తోట చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, పలువురు నేతలు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు, కీలక అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతంపై నేతలకు పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు. కార్తీక మాసంలో పర్యావరణం-పరిరక్షణ కోసం ఉద్దేశించిన కార్యక్రమాల నిర్వహణపై రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించింది. ఏపీ ప్రభుత్వ పనితీరు, హామీలు, పథకాల అమలులో వైఫల్యాలు, విద్యుత్ సంక్షోభం, సాగుదారుల సమస్యలు, జనసేన నేతలు, శ్రేణులపై అధికార పక్షం చేస్తున్న దాడులు, నమోదు చేస్తున్న తప్పుడు కేసులపై చర్చించారు. అలాగే తెలంగాణాలో గత 16 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెపై చర్చించారు.

Pavan4

నిర్మాణ రంగంపై ఆధారపడ్డ వారికి.. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లభించక తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్న అంశంపై కార్మికులకు మద్దతుగా జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో భారీ ర్యాలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీని నిర్వహించనున్నారు. ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది స్థానిక నాయకులతో చర్చించి ఖరారు చేస్తామని జనసేన నేతలు తెలిపారు.

48 వేలమంది ఆర్టీసీ కార్మికులను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామిక నిర్ణయాన్ని తలదన్నేలా అంతకు అయిదింతలు.. 2.5లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించేలా ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించే నిర్ణయం సరికాదన్నారు.

Next Story
Share it