జమ్ము-కశ్మీర్, లడఖ్ ల్లో కొత్త పొద్దు..నేటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలు!

By సత్య ప్రియ  Published on  31 Oct 2019 2:25 AM GMT
జమ్ము-కశ్మీర్, లడఖ్ ల్లో కొత్త పొద్దు..నేటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలు!

జమ్మూ కశ్మీర్ సంస్థానం భారతదేశంలో విలీనం కాగానే అక్కడి ప్రజలు “మేము కశ్మీర్ తో కలిసి ఉండబోము. మాకు కేంద్ర పాలిత ప్రాంతం ఇవ్వండి. మమ్మల్ని ఢిల్లీ నుంచే నేరుగా పాలించండి.” అని వేడుకున్నారు. “కావాలంటే మమ్మల్ని పంజాబ్ లో కలపండి. కానీ కశ్మీర్ తో కలిపి ఉంచకండి” అని విన్నపాలు చేసుకున్నారు. నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ససేమిరా కుదరదన్నారు. కశ్మీర్ తో కలిసే ఉండాలన్నారు. శ్రీనగర్ ఏలుబడిలోనే ఉండాలన్నారు. ప్రజలు తిరగబడితే వారిలో ఒకరికి ఒక బుగ్గకారు, ఓ మంత్రిపదవి, ఇద్దరు కానిస్టేబుళ్లను పారేయండని ఆదేశించారు.

యాభైయవ దశకంలో ఆ ప్రాంతంలోని ఒక భాగం గుండా చైనా రహదారి నిర్మించింది. నెమ్మదిగా లోలోపలికి చొచ్చుకువచ్చింది. పార్లమెంటులో ఎంపీలు ఈ విషయాన్ని లేవనెత్తితే “ ఆ నేల గురించి ఎందుకయ్యా అంత బాధ? అక్కడ గడ్డిపరక కూడా మొలవదు. దాని వల్ల ఏం లాభం” అని నాటి ప్రధాని ఆక్షేపించారు. చివరికి ఓం ప్రకాశ్ త్యాగీ అనే ఎంపీ లేచి, “అయ్యా ... మీ బుర్ర పైన ఒక్క వెంట్రుక కూడా లేదు కదా. మరి దాని వల్ల ఏం ఉపయోగం?” అని అడగాల్సి వచ్చింది. కానీ

ప్రధాని దృష్టిలో అది గడ్డి పరక కూడా మొలవని భూమే!!

మూడు లక్షల జనం కూడా లేరు. నాలుగంటే నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. దీని వల్ ఏం లాభం అంటూ రాజకీయ పార్టీలు ఆ భూభాగాన్ని పట్టించుకోలేదు. మొదటి రెండు పంచవర్ష ప్రణాళికల్లో అసలు ఆ ప్రాంతం ప్రసక్తే లేదు.

అలా ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తున్నావన్నట్టు అనాథలా మిగిలిపోయిన ఆ భూభాగం పేరు లడాఖ్. అక్టోబర్ 31న ఇన్నాళ్లూ జమ్మూ కశ్మీర్ లో ఒక జిల్లాలా పడున్న ఆ భూభాగం ఇప్పుడు ఒక కేంద్ర పాలిత ప్రాంతం అయింది. సగర్వంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో చోటు సంపాదించుకుంది.

క్లిష్టాతిక్లిష్టమైన భూభాగం...కష్టాతికష్టమైన సరిహద్దు

లడాఖ్ ఒక విచిత్ర ప్రాంతం. జమ్మూ కశ్మీర్ వైశాల్యంలో 60 శాతం లడాఖ్. అంత పెద్ద భూమిలో జనసాంద్రత మాత్రం చదరపు కిలో మీటర్ కు కేవలం ముగ్గురు. మొత్తం జనాభా రెండున్నర లక్షలుంటుంది. అది మంచు ఎడారి. వాన ఉండదు. పంటలుండవు. కిలో మీటర్ల పొడవున ఎక్కడా ఒక గడ్డిపోచ కూడా కనిపించదు. అక్కడ పడే హిమపాతం డ్రై ఐస్. దాని వల్ల చలి చర్మాన్ని కొరికేస్తుంది. ఫ్రాస్ట్ బైట్ అనే ఆరోగ్య సమస్య వస్తుంది. సముద్ర మట్టానికి 15000 అడుగుల ఎత్తున ఉండటంతో అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ. ఊపిరి అందదు. త్వరగా అలిసిపోతారు. బయటనుంచి వెళ్ళే వారికి ఆ వాతావరణం అలవాటు కావాలంటే ఒక రోజు రెండు రోజులు పడుతుంది. దారులు దుర్గమం. వనరులు దుర్లభం.

కానీ ఈ భూభాగం భారత దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. లడఖ్ నుంచి టిబెట్ లోకి, చైనాలోకి ప్రవేశించవచ్చు. మరో వైపు పాక్ కబ్జాలో ఉన్న బల్తిస్థాన్ ప్రాంతంలోకి లడఖ్ నుంచే మార్గం. లడఖ్ నుంచి మధ్య ఆసియా దేశాలైన తాజికిస్తాన్, కిర్గిజిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, అజర్ బైజాన్లోకి మార్గాలున్నాయి. చారిత్రికంగా దక్షిణాసియా, చైనా, టిబెట్, పశ్చిమాసియా, మధ్య ఆసియాలను కలిపే సిల్క్ రూట్ లడాఖ్ మీదుగానే వెళ్తుంది. లడాఖ్ చైనాకి సరిహద్దు. 1962 యుద్ధంలో చైనా లడాఖ్ లో అంతర్భాగమైన ఆక్సాయి చిన్ ను ఆక్రమించుకుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాస్తవ నియంత్రణ రేఖ ఉంది. కాబట్టి లడాఖ్ అత్యంత కీలకం. లడాఖ్ నుంచి చైనా కదలికలపై నిఘా ఉండే దౌలత్ బేగ్ ఓల్డీ అడ్వాన్స్ ఎయిర్ ఫోర్స్ లాండింగ్ స్టేషన్ కి మార్గం ఉంది. చుమర్, చుశూల్, రెజాంగ్ లా, డెప్సాంగ్, డేమ్ చోక్ వంటి చైనా సరిహద్దు ప్రాంతాలు లడాఖ్ లోనే ఉన్నాయి.

అంతే కాదు లడాఖ్ ప్రాంతపు ఉత్తర భాగాన ఉన్న కార్గిల్, డ్రాస్, టోలోలింగ్, టైగర్ హిల్ వంటి 15000 అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతాలు పాక్ ఆక్రమిత గిల్గిత్ బల్తిస్తాన్లకు మధ్య సరిహద్దులు. ఇక లడాఖ్ కు ఉత్తరాన ఉన్న సియాచిన్ ప్రాంత భద్రతలో కార్గిల్ దే కీలక పాత్ర. మైనస్ 60 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో మన సైనికులు సియాచిన్ ను కాపాడుతున్నారు. వీరికి సరకులు సరఫరా చేయాలన్నా, ఎలాంటి సహాయం చేయాలన్నా రహదారి మార్గం కార్గిల్ మీదుగానే వెళ్తుంది. అంతే కాదు సియాచిన్ పై నియంత్రణ ఉంటే అటు గిల్గిత్, బల్తిస్తాన్, ఇటు చైనాకు చెందిన కారకోరం రహదారిపై భారత్ నిఘా ఉంచడానికి వీలుంటుంది. కాబట్టి సైనిక వ్యూహపరంగా చాలా ప్రాధాన్యం కలిగి ఉన్న భూమి.

కానీ ఎనలేని వివక్ష... ఎక్కడా లేనంత ఉపేక్ష

ఇంత కీలకమైన భూభాగం అయినా లడాఖ్ మొదటి నుంచీ ఉపేక్షకు గురవుతూనే ఉంది. ఏ పథకమైనా, ఏ ప్రయోజనమైనా శ్రీనగర్ లోనే ఆగిపోయేది. ఆఖరికి ముఖ్యమైన రహదారులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా అక్కడే ఫైళ్లలో మూలుగుతూండేవి. కేంద్రం ఏదైనా చేయాలనుకున్నా రాష్ట్రప్రభుత్వం మోకాలడ్డు పెడుతూ ఉండేది. చైనా సరిహద్దుల్లో ఉన్నప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. అందుకే ఇక్కడి ప్రజలు 1947 నుంచే తమను కేంద్ర పాలిత ప్రాంతంగా నేరుగా ఢిల్లీ ఆజమాయిషీలో ఉంచుకొమ్మని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ ప్రాంతం ఘోర వివక్షకు గురైందని 1960 లో వచ్చిన గజేంద్ర గడ్కరి కమిషన్, 1970 లలో వచ్చిన సిక్రీ కమిషన్, ఆ తరువాత మరో రెండు కమీషన్లు ఘంటాపథంగా చెప్పాయి. అయినా కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 1980 లలో బిజెపి ఎంపీ తరుణ్ విజయ్ ప్రైవేటు మెంబర్ బిల్ ను రాజ్యసభలో ప్రవేశపెట్టి, లడాఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత లడాఖ్ లో స్వయంపాలిత కౌన్సిల్ ఏర్పాటయింది. కానీ దానికి ఎలాంటి అధికారాలూ ఇవ్వలేదు. బిజెపి 2014 నుంచి లడాఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొంటూ వస్తోంది. కానీ అన్నీ శ్రీనగర్ సైంధవుడిని దాటలేకపోయాయి

చివరికి లడాఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 370 ని కేంద్రం తొలగించి, బిజెపి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆగస్టు 5 న ఆర్టికల్ 370 ని తొలగించడం తో పాటు, లడాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. దీంతో లడాఖ్ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష ఇన్నాళ్లకు నెరవేరింది.

ఇప్పుడే ఎందుకు?

ఇన్నాళ్ల పాటు కోరుతున్నా లడాఖ్ ను రాజకీయ నాయకులు ఒక జిల్లాగా మాత్రమే ఉంచారు. ఇప్పుడే ఎందుకు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారన్నది అసలు ప్రశ్న! అసలు కారణం ఏమిటంటే అఫ్గనిస్తాన్ ను అమెరికా వైదొలగిన తరువాత తాలిబాన్లు, ఇస్లామిక్ ఉగ్రవాద శక్తులు కశ్మీర్ పై దృష్టి కేంద్రీకరించబోతున్నాయన్న విషయం ప్రధాని మోదీకి అర్థమైంది. ఈ విషయంలో పాకిస్తాన్ సైన్యం, పాలకులు వారికి పూర్తిగా సహకరిస్తారని, ఈ విషయంలో అమెరికా చూసీ చూడనట్టు వ్యవహరించబోతోందని కూడా మోదీ గుర్తించారు. ఈ నేపథ్యంలో లడాఖ్ ను మిగతా కశ్మీర్ నుంచి వేరు చేసి, దాని రక్షణ, భద్రత, పురోగతి వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన భావించారు. ఇందులో భాగంగానే ఆయన లడాఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేశారు. ఇక్కడ అసెంబ్లీ లేకుండా చేయడం వల్ల జనాభా ఆధారంగా ముస్లింలకు, బౌద్ధులకు మధ్య ఘర్షణలు తలెత్తకుండా చేశారు. నేరుగా కేంద్ర ఆజమాయిషీలోనే ఉంచడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే వీలును కల్పించారు.

లడాఖ్ అభివృద్ధికి అవకాశాలు

నిజానికి లడాఖ్ అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలున్నాయి.

· ముఖ్యంగా రవాణా మార్గాల మెరుగుదలను చేపడితే రాకపోకలు పెరుగుతాయి. వివిధ దేశాలతో రాకపోకలు పెరిగితే ఆదాయం పెరుగుతుంది. అదే విధంగా టూరిజం పెద్ద ఎత్తున పెరుగుతుంది. దీని వల్ల స్థానికులకు ఆదాయవనరులు పెరుగుతాయి.

· లడాఖ్ నేల సోలార్ విద్యుదుత్పత్తిలో కీలక పాత్ర పోషించవచ్చు. లడాఖ్ లో దాదాపు 250 గిగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పాదన చేయవచ్చు. ఇది చవకైనదే కాక దేశం యావత్తు అవసరాలను తీర్చగలదు. సూర్య కాంతి లభ్యత, ఖాళీ నిరుపయోగ భూమి లభ్యత దృష్ట్యా లడాఖ్ ఈ విషయంలో చాలా అనుకూలమైనది.

· లడాఖ్ దేశ తాగు, సాగు నీటిని చాలా సులువుగా తీర్చవచ్చు. లడాఖ్ లో 700 కి పైగా హిమానీ నదాలున్నాయని అంచనా. ఇవి ప్రధానంగా జన్ స్కార్, నుబ్రా లోయల్లో ఉన్నాయి. ఇవే కాక సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదులు లడాఖ్ నుంచే వెళ్తాయి. ఈ నీటి వనరులను ఉపయోగించుకుంటే దేశం నీటి అవసరాలు తీరడమే కాక, జల విద్యదుత్పాదన చేయవచ్చు. లడాఖ్ లో దాదాపు 770 మెగావాట్ల విద్యుదుత్పాదన చేయడానికి వీలుంటుంది.

· ఉత్తరాఖండ్ లోని కుమాయూ విశ్వవిద్యాలయం పరిశోధనల్లో లడాఖ్ లో అత్యంత అమూల్యమైన 5.36 గ్రేడ్ యూరోనియం ఉందని తేలింది. నుబ్రా, శ్యోక్ లోయల్లో ఉన్న ఉదమారు అనే గ్రామంలో ఈ అత్యుత్తమ గ్రేడ్ యూరేనియం దొరుకుతుందని అధ్యయనాలు తెలిపాయి. దీనిని ఎగుమతి చేస్తే మన దేశానికి అత్యంత విలువైన విదేశీ మారకం లభిస్తుంది. థోరియం కూడా లడాఖ్ లో పుష్కలంగా ఉంది

· కార్గిల్, ద్రాస్ ప్రాంతంలో విలువైన సున్నపు రాయి, గ్రానైట్, పాలరాతి నిక్షేపాలున్నాయి. ఇది ఒక పెద్ద ఆదాయ వనరు.

· ఇక లడాఖ్ లోని పాంగాంగ్ చెరువును జలాంత్గత టెస్టింగ్ సెంటర్ గా మార్చు కోవచ్చు. ప్రస్తుతం మన దేశం కజాకిస్తాన్ లోని ఇసిక్కుల్ చెరువును టెస్టింగ్ సెంటర్ గా ఉపయోగించుకుంటోంది. దీనికి చాలా పెద్ద మొత్తం ఖర్చవుతుంది. ఆర్టికల్ 370 అడ్డంకుల వల్ల ఇన్నాళ్లూ ఈ పనిని చేయడం సాధ్యపడలేదు. ఇప్పుడు అవరోధాలన్నీ తొలగిపోవడం వల్ల ఇప్పుడు పాంగాంగ్ సరస్సును ఉపయోగించుకోవచ్చు.

ఇలా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు కావడంతో లడాఖ్ దశ తిరిగినట్టు భావించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఈ సాహసోపేత విప్లవాత్మక నిర్ణయం లడాఖ్ నుదిటి రాతను మార్చేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే ఆక్టోబర్ 31 న ప్రాణం పోసుకుంటున్న చిన్నారి లడాఖ్ కు శుభాకాంక్షలు చెబుదాం. ప్రగతి పదంలో వేగం ఆగకుండా ముందుకు సాగాలని కోరుకుందాం.

-రాకా సుధాకర్, జమ్ము&కశ్మీర్ స్టడీ సెంటర్ పరిశోధకులు

Next Story