గత ఏడాది ఆగస్టు 5న జరిగిన అవమానాన్ని మర్చిపోలేము: మహబూబా ముఫ్తీ

By సుభాష్  Published on  14 Oct 2020 8:21 AM GMT
గత ఏడాది ఆగస్టు 5న జరిగిన అవమానాన్ని మర్చిపోలేము: మహబూబా ముఫ్తీ

గత సంవత్సరం ఆగస్టు 5న జరిగిన అవమానాన్ని మాలో ఎవరు కూడా మార్చిపోలేమని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ అన్నారు. 14నెలల నిర్బంధం తర్వాత మంగళవారం రాత్రి ఆమెను విడుదల చేశారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ ప్రజలను ఉద్దేశించి మహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. ఢిల్లీ దర్బార్‌ ఆర్టికల్‌ 370ని చట్ట విరుద్దంగా, ప్రజా స్వామ్య వ్యతిరేక పద్దతిలో రద్దు చేసిందని, దానిని తిరిగి సాధిస్తామని అన్నారు. ఇదే మాత్రమే కాకుండా కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. దీని కోసం ఎంతో మంది కశ్మీరీలు తమ ప్రాణాలు వదులుకున్నారని, ఇందు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కానీ మా పోరాటాన్ని కొనసాగిస్తాం..ఈ రోజు నన్ను విడిచిపెట్టారు. ఇంకా చాలా మంది చట్ట విరుద్దంగా నిర్బంధంలో ఉన్నారు. వారందరిని కూడా విడుదల చేయాలని కోరుతున్నాను.. అని అన్నారు.

కాగా, గత ఏడాది ఆగస్టులో కేంద్రం కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మహబూబాతోపాటు పలువురు నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొదట్లో ఆమెను ఐపీసీ 107, 151 సెక్షన్ల కింద అరెస్టు చేశామని చెప్పిన అధికారులు.. అనంతరం వివాదస్పద పబ్లిక్‌ సేఫ్టీ యాక్ట్‌ కేసు నమోదు చేశారు. దీని ప్రకారం ఎలాంటి విచారణ లేకుండా మూడు నెలల పాటు నిర్బంధంలో కొనసాగించేందుకు వీలుంటుంది.

గత ఏడాది ఆగస్టు 5న అదుపులోకి..

గత ఏడాది ఆగస్టు 5వ తేదీన మహబూబా ముఫ్తీని అదుపులోకి తీసుకుని చెష్మా షామి అతిథి గృహంలో కొన్ని రోజులు, ఎంఏ లింక్‌ రోడ్డులోని మరో అతిథి గృహంలో మరి కొంతకాలం ఉంచారు. అక్కడ నుంచి ఆమెను సొంతింట్లోకి తీసుకెళ్లి గృహ నిర్బందంలో ఉంచారు. అయితే ప్రభుత్వ చర్యను సవాలు చేస్తూ ఆమె కుమార్తె ఇల్తిజా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సెప్టెంబర్‌ 29న విచారించిన న్యాయస్థానం.. ఇంకా ఎంత కాలం ముఫ్తీని నిర్బంధంలో ఉంచుతారని కేంద్ర, కశ్మీర్ యంత్రాంగాన్ని ప్రశ్నించింది. రెండువారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. గడువు ముగియనున్న క్రమంలో ఆమెను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం.

Next Story
Share it