సినీ హీరోయిన్‌ రష్మిక మందనాపై జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ట్విటర్‌ ఖాతా నుంచి చేసిన ట్వీట్‌పై పోలీసులు నిగ్గు తేల్చారు. దీనంతటికి కారణం పరిశ్రమల శాఖ జీఎం అని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల రష్మిక తనకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేసింది. అయితే ఆ ఫొటోలకు ‘చించావ్‌ పో’ అని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ట్విటర్‌ ఖాతా నుంచి కామెంట్‌ చేశారు. దీంతో ఈ ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది.

ఉన్నత పదవిలో ఉన్న కలెక్టర్‌ ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటని పలువురు నెటిజన్లు విమర్శలు, ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా ఈ ట్వీట్‌పై వెంటనే అప్రమత్తమైన కలెక్టర్‌ గుగులోతు రవి.. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తాను ఆ ట్వీట్‌ చేయలేదని, తన ట్విటర్‌ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న జగిత్యాల పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ట్వీట్‌ను ఖాతా నుంచి తొలగించారు. ఐపీ అడ్రస్‌ ద్వారా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ గంగాధర శ్రీనివాస్‌ ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో శ్రీనివాస్‌ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగిత్యాల ఈ-మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారిగా శ్రీనివాస్‌ బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో కలెక్టర్‌ ఖాతాను శ్రీనివాస్‌ వాడారు. ఆ తర్వాత కూడా ఆ ట్విటర్‌ ఖాతాను వాడాడని పోలీసుల విచారణలో తెలిసింది. రష్మిక మందనాపై కామెంట్‌ పెట్టిన సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Jagtial Collector controversial Tweet

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.