తెలంగాణలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించడం పెద్ద గొప్ప విషయం కాదని, తాము ఓడిపోవడం చాలా మంచిదైందని, ఒక వేళ గెలిచినా మున్సిపల్‌ చైర్మన్‌గా ఏ పనులు చేయకపోయేవాళ్లమని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్న పార్టీకి అన్ని బలాలు ఉన్నా.. కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చిందని అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ పార్టీ వర్గాల వద్ద డబ్బులు లేకపోవడంతోనే తాము పరాజయం అయ్యామని, ఎన్నికల్లో గెలిచినా..  ఓడినా కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు హీరోనే అని వ్యాఖ్యనించారు. ఓడిపోయినంత మాత్రానా కాంగ్రెస్‌కు ప్రజాదరణ లేదనుకోవడం పొరపాటేనని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం కేసీఆర్‌ వైపు ప్రజలెందుకు నిలబడుతున్నారనేది పరిశీలిస్తామన్నారు. ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రజలను ఏదో విధంగా మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో డబ్బు ప్రభావం అధికంగా కనిపించిందన్నారు. డబ్బులతో ఎన్నికల్లో గెలువవచ్చనే విధానాన్ని టీఆర్‌ఎస్‌ తీసుకొచ్చిందని, కాంగ్రెస్‌ దగ్గర డబ్బులు లేకున్నా ప్రజాభిమానాలు ఉన్నాయన్నారు. నా సతీమణి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కాకపోవడమే మంచిదైందని, ఓటర్లు నామీద ఒత్తిడి లేకుండా చేశారని జగ్గారెడ్డి అన్నారు. ఇప్పుడు ఉమ్మడి మెదక్‌ జిల్లాకు సింగూరు నీళ్లను తీసుకువచ్చే బాధ్యతను ప్రజలు హరీష్‌రావుకు అప్పగించారని జగ్గారెడ్డి గుర్తు చేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.