వైసీపీలోకి జగన్‌ ప్రత్యర్థి!.. 13న చేరిక?

టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ఆ పార్టీ విలవిల్లాడిపోతోంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో వలసలకు ఎలా అడ్డుకట్ట వేయాలో అర్థకాని పరిస్థితుల్లో టీడీపీ నేతలు పడిపోయారు. ఇప్పటికే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌లు జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత, బాలయ్య స్నేహితుడు బాబూరావుసైతం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతకూడా వైసీపీలో చేరనున్నారు. పలు మార్లు పులివెందలలో జగన్‌కు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి పోటీచేసిన సతీష్‌రెడ్డి కూడా టీడీపీ వీడే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. పులివెందల నియోజకవర్గంలోని వేంపల్లిలో ఉన్న తన నివాసంలోఅనుచరులతో సమావేశమైన సతీష్‌రెడ్డి భవిష్యత్‌ కార్యాచరణపై అందరితో చర్చించారు. చర్చల అనంతరం టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నాడు.

Also read: టీడీపీకి షాక్‌.. వైసీపీలోకి బాలయ్య స్నేహితుడు?

ఈ మేరకు మంగళవారం సతీష్‌ కుమార్‌ రెడ్డి కార్యకర్తల సమావేశంలో .. టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించాడు. దశాబ్దాలుగా వైఎస్‌ కుటుంబంతో తలపడుతున్నతెదేపా నుంచి తనకు సరైన ఆదరణ లభించలేదని ఆరోపించారు. మనస్సును చంపుకొని తెలుగుదేశం పార్టీలో ఉండేది లేదని స్పష్టం చేశాడు. కాగా ఈ నెల 13న వైసీపీలో తాను చేరబోతున్నట్లు సతీష్‌ కుమార్‌ వెల్లడించారు. ఇప్పటికే కడప జిల్లాలో టీడీపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండగా.. ప్రస్తుతం సతీష్‌కుమార్‌ రెడ్డి పార్టీని వీడటం టీడీపీ పార్టీకి కడపలో కోలుకోలేని దెబ్బగా  భావిస్తున్నారు.

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నుంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం టీడీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంత జరుగుతుంటే టీడీపీ ముఖ్యనేతలు ఏం చేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీ నాటికి మరికొందరు టీడీపీని వీడి వైసీపీలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైన టీడీపీ అధిష్టానం మేల్కొని వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్ కు ఎలా అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాల్సిందే.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *