జగన్‌ కీలక నిర్ణయం.. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌

By సుభాష్  Published on  5 May 2020 10:59 AM GMT
జగన్‌ కీలక నిర్ణయం.. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌

ఏపీ సర్కార్‌ పేదలకు భూ పంపిణీకి సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పేదలందరికీ జులై 8వ తేదీన పట్టాలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈలోగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంకా లబ్ధిదారులు మిగిలిపోయారని విజ్ఞప్తులు నాకు అందాయని జగన్‌ అన్నారు. మరో పదిహేను రోజుల సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల జాబితా పెట్టాలన్నారు. నాకు ఓటు వేయని వారైనా పర్వాలేదు.. వాళ్లకు పట్టాలు ఇవ్వాల్సిందేనని జగన్‌ స్పష్టం చేశారు. అర్హత ఉన్నవారు ఎవ్వరూ కూడా ఇంటి పట్టాల లేదని ఫిర్యాదులు అందకూడదని, 27 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామన్నారు.

ప్రతి సచివాలయంలో కూడా ముఖ్యమైన నంబర్‌లు

ప్రతి సచివాలయంలో ముఖ్యమైన నంబర్లు ఉంచుతామని అన్నారు. ఈ నంబర్లు ప్రతి గ్రామ, వార్డు, సచివాలయాల్లో ఉండాలని సూచించారు.

టెలీ మెడిసిన్‌కు మంచి రెస్పాన్స్‌

అలాగే టెలి మెడిసిన్‌ కోసం ఒక నంబర్‌ కేటాయించామని, అందుకు మంచి రెస్పాన్స్‌ వస్తుంది అధికారులు చెబుతున్నారని అన్నారు. కాల్‌ చేసిన వారికి ప్రిస్కిప్షన్‌ ఇచ్చిన తర్వాత ఆ వివరాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో పాటు, కలెక్టర్లకు వస్తాయన్నారు. అంతేకాదు ఈ విషయంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలన్నారు.

పీహెచ్‌సీ పరిధిలో ఒక ద్విచక్ర వాహనాన్ని, థర్మల్‌ బాక్సును అందుబాటులో ఉంచాలన్నారు. 24 గంటల్లోగా ప్రిస్కిప్షన్‌ ప్రకారం మందులు వెళ్లాలన్నారు. త్వరలో గ్రామాల్లో క్లినిక్‌ ప్రారంభం అవుతుందని, అప్పుడు టెలీ మెడిసిన్‌ మరింత బలోపేతం అవుతుందని జగన్‌ పేర్కొన్నారు. ఈ వ్యవస్థపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని కోరారు.

Next Story