ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

By సుభాష్  Published on  25 July 2020 9:42 AM GMT
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

ఏపీలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజటివ్‌ పెరుగుతున్న నేపథ్యంలో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి సర్కార్ ఎన్ని చర్యలు చేపట్టినా ఏమాత్రం తగ్గడం లేదు. గత వారం రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదువుతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే పలు నగరాలు స్వచ్చంధంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తుండగా, ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అలాగే కరోనా పరీక్షల్లో ఏపీ రికార్డు సాధిస్తోంది. ఇక కరోనా వస్తే ఏం చేయాలి..? ఎవరిని సంప్రదించాలి..? అనే అంశాలపై ప్రజలకు అవగాహన కలిగేలా ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయాలని, ప్రతి చోట హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే.

తాజాగా కరోనా సందేహాలకు పరిష్కారం లభించే విధంగా కోవిడ్‌-19 ఆంధ్రప్రదేశ్‌ అనే పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. కోవిడ్‌పై సరైన అవగాహన కలిగేలా అవసరమైన సమాచారం దొరుకుతుంది. అలాగే రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలు, కోవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలు, కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ యాప్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ లింక్ https://bit.ly/30fvmbm సహాయంతో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Next Story