కరోనా అంటుకుందనే అనుమానం.. లేడి డాక్టర్‌ను చంపేశాడు
By తోట వంశీ కుమార్ Published on 2 April 2020 6:52 PM IST
కరోనా వైరస్ ప్రపంచాన్న వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి వల్ల వేల సంఖ్యలో మృత్యువాత పడగా.. లక్షల్లో దీని బాధితులు ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఓ వ్యక్తి తన ప్రియురాలి వల్లనే తనకు కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో.. దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలిని చంపేసి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఇటలీలోని సిసిలీ ద్వీపానికి చెందిన లారెనా క్వారెంటా, అంటోనియా డి పేస్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. లారెనా డాక్టర్ కాగా, ఆంటోనియా అదే హాస్పిటల్‌లో మేల్ నర్సుగా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి ఇద్దరు కరోనా రోగులకు సేవలందిస్తున్నారు.
కాగా ఇటీవల ఆంటోనియా కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి కరోనా వైరస్ సోకిందనే అనుమానం మొదలైంది. హస్పిటల్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న తనకు కరోనా సోకే అవకాశం లేదని, తన ప్రియురాలి వల్లనే కరోనా సోకిందనే అనుమానించేవాడు. బుధవారం రాత్రి నిద్రపోతున్న ప్రియురాలిని ఆంటోనియా గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కొద్దిసేపటికే భయం వేసి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో కాసేపటికే పోలీసులు అక్కడికి చేరుకుని ఆంటోనియాను ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. లారెన్, ఆంటోనియాకు కరోనా టెస్ట్‌ల్లో నెగిటివ్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.