మంచు కాదు.. ఇనుప వాన
By సుభాష్ Published on 13 March 2020 12:40 PM ISTవడగళ్ల వాన చూసాం.. పూల వాన క్రియేట్ చేసాం.. కానీ మీరెప్పుడైనా ఇనుప వాన చూసారా.. పోనీ విన్నారా… అసలు ఆలోచనైనా వచ్చిందా.. అయితే ఇది చదవండి.
నిత్యం వేడిగా ఉండే ఓ గ్రహంపై అసాధారణ రీతిలో ఇనుము వర్షాలు కురుస్తున్నాయి. సౌర కుటుంబానికి వెలుపల 650 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘డబ్ల్యూఏఎస్‌పీ-76బీ’ గ్రహంపై పగటిపూట ఉష్ణోగ్రత్తలు దాదాపు 2400 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటాయని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవా యూనివర్సిటీతో కలిసి నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ గ్రహంపైనున్న బలమైన గాలులు అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ఆవిరైన ఇనుముని రాత్రి వేళల్లో చల్లగా ఉన్న ప్రదేశాలకు తీసుకువెళ్తాయి. అక్కడ ఈ ఆవిరి ఇనుప బిందువులుగా ఘనీభవిస్తుందని ఈ అధ్యయనం గురించి నేచర్ జర్నల్‌లో ప్రచురించారు.
ఇది మన సౌరవ్యవస్థ వెలుపల అత్యంత తీవ్రమైన గ్రహాల వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి మంచి మార్గంగా ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. దక్షిణ అమెరికాలోని చిలీ అటాకామా ఎడారిలోని ఖగోళశాలలోని ఖగోళ శాస్త్రవేత్తలు హై రిజల్యూషన్ స్పెక్ట్రోగ్రాఫ్ను ఉపయోగించి దీనిని కనుగొన్నారు. ఈ గ్రహంపై వేడి వాతావరణంలో ఇనుప ఆవిరి సమృద్దిగా ఉందని, అది బలమైన గాలుల కారణంగా చల్లటి ప్రదేశాల్లో ఘనీభవిస్తుందని స్పెయిన్‌లోని సెంటర్ ఫర్ ఆస్ట్రోబయాలజీలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు చెప్పారు.
ఆ సమయంలో ఇనుము బిందువులుగా ఘనీభవిస్తుందని గుర్తించామని చెప్పారు. ఒక నక్షత్రం చుట్టూ ఆ గ్రహం ఎదురుగా తిరుగుతున్న సమయంలో అందులోనూ పగటిపూటమాత్రమే ఇనుము వర్షం కురుస్తుంది. వాతావరణం చల్లబడ్డాక రాత్రిపూట పూర్తి చీకటిగా ఉంటుంది. నిజానికి భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు 5 గంటల సమయం తీసుకుంటుంది. కానీ ఆ గ్రహం మాత్రం తన మాతృ నక్షత్రానికి దగ్గరగా ఉండటంతో పరిభ్రమణానికి కేవలం 48 గంటలు పడుతుంది.