అమెజాన్ అడవి త్వరలోనే అంతరించిపోతుందా?

మరో యాభై సంవత్సరాల్లో అమెజాన్ అడవులు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అంతా పచ్చపచ్చగానేకనిపిస్తున్నా, లోలోపల అటవీ వ్యవస్థ, దాని జీవావరణం పలు ఒడిదుడుకులకు లోనవుతోంది. దీని వల్ల అడవులు నెమ్మది నెమ్మదిగా అంతరిస్తున్నాయి. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే పర్యావరణ సమతౌల్యపు తరాజు ఒక్క సారి వినాశనం వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంది. అదే జరిగితే వినాశనం వేగవంతమౌతుంది. అటవీ వ్యవస్థ లేదా ఫారెస్ట్ ఎకో సిస్టమ్ శరవేగంగా అంతరించిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అమెజాన్ పై యూనివర్సిటీ ఆఫ్ లండన్ వారు చేసిన అధ్యయనంలో చిన్న, పెద్ద పర్యావరణ వ్యవస్థలు ఏయే వేగాలతో నాశనమైపోతాయన్న అంశంపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ఫలితాలను నేచర్ కమ్యూనికేషన్స్ అన్న పరిశోధనా పత్రికలో ప్రచురించారు. ఇప్పుడున్న పరిస్థితే కొనసాగితే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, వెస్టిండీస్ తీరంలోని కోరల్స్ శరవేగంగా అంతరించిపోయే ప్రమాదం ఉందని ఈ పరిశోధనలు వెల్లడించాయి. యాభై ఏళ్ల తరువాత అమెజాన్ వర్షారణ్యాలు ఆఫ్రికాలోని సవానా అడవులుగా మారిపోవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. సవానా అంటే గడ్డి దుబ్బుగా పెరిగి, అక్కడక్కడా చిన్న, చిన్న చిన్న వృక్షాలు మాత్రమే ఉండే అడవులన్న మాట.  అమెజాన్ అడవుల్లో దావానలం వ్యాప్తి వల్ల కూడా అడవులు అంతరించిపోవచ్చునని తెలుస్తోంది. ఈ మార్పులకు మానవాళి సిద్ధంగా ఉండాలని పరిశోధకుడు సైమన్ విల్ కాక్ చెబుతున్నారు.

పర్యావరణంలో శరవేగంగా వస్తున్న మార్పుల వల్ల ఈ ఎకో సిస్టమ్ ల వల్ల ఒనగూరుతున్న లాభాలు కనుమరుగైపోతాయి. దీని వల్ల ఆహార లభ్యత, వాతావరణ సౌలభ్యాలు, ఇంధన లభ్యత, నీటి లభ్యత, ఆక్సిజెన్ లభ్యత వంటివి ప్రభావితమౌతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒదాహరణకు ఏనుగుల వంటి జంతువులు చెట్లను కూల్చి వేస్తాయి. కానీ అదే ప్రక్రియలో విత్తనాలను దూరదూరంగా వెళ్లేలా చేస్తాయి. దీని వలన అడవులు వ్యాప్తి చెందుతాయి. ఏనుగులు నశిస్తే ఈ ప్రక్రియ కూడా దెబ్బతిటుంది. అందుకే ఇలాంటి జంతువులను కీ స్టోన్ స్పిషీస్ అంటారు. ఇవి అంతరించడం పర్యావరణానికి ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఇలాంటి ప్రక్రియల వల్ల మొత్తానికి అడవులకే ముప్పు ముంచుకొస్తుందని వారంటున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *