రచయితలు లేకపోతే మేము లేము అనేది వాస్తవం - చిరంజీవి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2019 7:01 AM GMT
రచయితలు లేకపోతే మేము లేము అనేది వాస్తవం - చిరంజీవి

తెలుగు సినీ రచయితల సంఘం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ర‌జ‌తోత్స‌వ వేడుకలు ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగాయి. ముందుగా భలభద్రపాత్రుని రమణి తొలి పలుకులతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆకెళ్ళ కార్యదర్శి నివేదిక సమర్పించారు. మహిళా సభ్యులందరూ దీపారాధనతో ప్రారంభించారు. అనంతరం రమణాచారి చేతులమీదుగా, ఛాంబర్‌ వారి చేతులమీదుగా 6 నిముషాల నిడివి గల వీడియో వ్యవస్థాపక పురస్కారాలు, ప్రతిభా పురస్కారాలు, గౌరవపురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా హాజరైన ముఖ్య అతిథి మెగాస్టార్‌ చిరంజీవి సీనియర్‌ రచయితలైన ఆదివిష్ణు, రావికొండలరావు, సత్యానంద్‌, భువనచంద్రలకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు.

అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ… ఇక్కడకు రావడం అత్యంత సంతోషం, సంతృప్తికరం. సినీపరిశ్రమలో దర్శక నిర్మాతల తర్వాత అత్యధికంగా గౌరవించేది, సన్నిహితంగా ఉండేది రచయితలతోనే. పరుచూరి బ్రదర్స్‌, సత్యానంద్ గారికి ఆ విషయం తెలుసు. అంతటి గౌరవాన్ని ఇస్తుంటాను. రచయితలు లేకపోతే మేము లేము అనేది వాస్తవం. ఈ మధ్య దీపావళికి మోహన్‌బాబు ఇంటికి వెళ్ళాం. అక్కడ అందమైన వెండి సింహానం వుంది. అది చూడగానే.. సత్యానంద్‌ను రాఘవేంద్రరావు గారు కూర్చో పెట్టారు. అది చూశాక.. కరెక్టేకదా.. ఆ స్థానం అలంకరించే అర్హులు సత్యానంద్‌ గారు అనిపించింది. ఒక్క సత్యానంద్‌నే కాదు రచయితలందరూ గౌరవించేదిగా వుంటుంది.

ఈ విషయమై సరదాగా మోహన్‌బాబుగారు ఓ మాట అన్నారు. రాఘవేంద్రరావును నిలబెట్టి సత్యానాంద్‌ను కూర్చొపెట్టడం ఏమిటని.. అప్పుడు.. నేనన్నాను. రాఘవేంద్రరావు శిల్పి. అది చెక్కాలంటే తగిన రాయికావాలి. అది కంటెంట్‌. ఆ కంటెంట్‌ సత్యానంద్‌.. అందుకే గౌరవించుకోవడం జరిగిందని.. సరదాగా మాట్లాడుకున్నాం. ఇదంతా రచయితలతో నాకున్న అనుబంధం. పరుచూరి బ్రదర్స్‌తో అనుబంధం చాలా వుంది. కుటుంబ సభ్యుల్లా అయిపోయాం. ఈ సభకు నన్ను పిలిచి గొప్ప అనుభూతి పొందే అవకాశం ఇచ్చారు. ఎంతో అనుభవం వున్న ప్రతిభ వున్నవారికి నా చేతుల మీదుగా సన్మానం చేయడం జీవితంలో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నామన్నారు.

Next Story
Share it