ఎవరివీ.. ఈ రూ.2వేల కోట్లు..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Feb 2020 4:22 PM GMT
ఎవరివీ.. ఈ రూ.2వేల కోట్లు..?

ఈ సాయంత్రం ఐటీశాఖ చేసిన ప్రకటనతో తెలుగురాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. రూ.2వేల కోట్లకు సంబంధించి భారీ అవినీతి గుట్టురట్టు అవడంతో ఇటు అధికారుల్లోనూ.. అటు నాయకుల్లోనూ కలవరం మొదలైంది. మొత్తం 40 ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాలలో భారీ అక్రమాల చిట్టా బయటపడడం.. ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు మొదలైంది. బోగస్‌ కాంట్రాక్టులు, సబ్‌ కాంట్రాక్టులలో .. తప్పుడు లెక్కలతో పెద్ద ఎత్తున నిధుల గోల్‌మాల్‌కి పాల్పడ్డారని ఐటీశాఖ ప్రకటించడంతో.. ప్రస్తుతం వారు ఎవరై ఉంటారు అన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది.

వీరేనా..?

గతవారం చంద్రబాబు పీఎస్‌గా పనిచేసిన పీ.శ్రీనివాస్, మాజీ మంత్రి పత్తిపాటు పుల్లారావు తనయుడు శరత్, ప్రతిమా హాస్పిటల్స్‌ చైర్మన్‌ బోయినపల్లి శ్రీనివాస్‌రావు, కిలారు రాజేష్, నారా బ్రాహ్మిణీ, నారా భువనేశ్వరీ డైరెక్టర్లుగా ఉన్న పలు సంస్థలు, ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహించడం తెలిసిందే. తాజాగా ఐటీశాఖ ప్రకటనలో తెలిపిన రూ.2వేల కోట్ల అవినీతికి పాల్పడింది వీరే అయిఉంటారన్న ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.

పెండ్యాల శ్రీనివాస్.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వద్ద పదేళ్లుగా వ్యక్తిగత కార్యదర్శిగా విధులు నిర్వహించిన పెండ్యాల శ్రీనివాస్ కు చెందిన నివాసాలు, ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరిగాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో.. ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఈ సాయంత్రం ఐటీశాఖ ప్రకటనతో భారీ అవకతవకలకు కూడగట్టారనే వార్తలకు బలం చేకూరినట్టైంది.

కిలారి రాజేష్‌.. చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌కి అత్యంత సన్నిహితుడు. 2014,19 ఎన్నికల్లో టీడీపీ వార్‌ రూమ్ప్‌ను మేనేజ్ చేశాడు. 2014 టీడీపీ విజయంలో కీలకపాత్ర పోషించడంతో.. రాజేష్‌ పవర్‌ పుల్‌ వ్యక్తిగా మారాడు. నిర్వాణా కంపెనీకి పూర్తి స్థాయి డైరెక్టర్‌గా ఉన్న రాజేష్.. చంద్రబాబు సతీమణీ నారా భువనేశ్వరీ, కోడలు నారా బ్రాహ్మిణీ, డైరెక్టర్లుగా ఉన్న హెరిటేజ్‌ ఫైనాన్స్, అశ్వాస్ హెల్త్‌కేర్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. గతవారం ఇతని ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఐటీ రైడ్స్‌ జరిగాయి. ఐటీ ప్రకటనతో మరోమారు రాజేష్ పేరు రాజకీయ వర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది.

పత్తిపాటి శరత్‌.. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తనయుడు. గత ప్రభుత్వంలో చంద్రబాబు కేబినేట్‌లో కీలకశాఖలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పత్తిపాటి తనయుడు శరత్‌ కు చెందిన అవెక్సా కార్పొరేషన్‌లో కూడా.. ఐటీశాఖ దాడులు జరిగాయి. ఐటీ ప్రకటనతో శరత్ పేరు తెరపైకి వచ్చింది.

అలాగే.. టీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ తమ్ముడు ప్రతిమా హాస్పిటల్స్‌ చైర్మన్‌ బోయినపల్లి శ్రీనివాస్‌రావు కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఈ ఐటీ దాడులు జరిగాయి. ఐటీ ప్రకటనతో ఇప్పుడు ఈ పేరు కూడా అందరి నోళ్లల్లో నానుతుంది.

కడప టీడీపీ ప్రెసిడెంట్ రెడ్డప్పగారి శ్రీనివాస్‌రెడ్డి.. ఇతనికి సంబంధించిన ఇళ్లు, ఆర్కేఇన్‌ఫ్రాకార్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్కే ఇన్‌ఫ్రా గ్రూప్ కార్యాలయాల్లో కూడా దాడులు జరిగాయి. శ్రీనివాస్‌రెడ్డి గతంలో ఇరిగేషన్‌, రోడ్డు పనులకు సంబందించి పలు భారీ కాంట్రాక్టులను దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఐటీ ప్రకటనతో ఈ పేరు కూడా చర్చకు వస్తోంది.

Next Story