క్రిస్మస్ నాడే 11 మంది క్రీస్టియన్ ప‌సిపిల్ల‌ల‌ను బలిగొన్న ఇస్లామిక్ ఉగ్రవాదులు...

By Newsmeter.Network  Published on  28 Dec 2019 8:31 AM GMT
క్రిస్మస్ నాడే 11 మంది క్రీస్టియన్ ప‌సిపిల్ల‌ల‌ను బలిగొన్న ఇస్లామిక్ ఉగ్రవాదులు...

నైజీరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నసమయంలోనే పదకొండు మంది పిల్లలను అపహరించుకుపోయి, వారిని దారుణాతిదారుణంగా శిరచ్ఛేదం చేసి చంపారు. ఈ సంఘటన ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండే ఈశాన్య జిల్లాలో జరిగింది. ఈ దారుణానికి ఐఎస్ ఐఎస్ తో ముడిపడ్డ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ ప్రావిన్స్ (ఇస్వాప్) సంస్థ ఉగ్రవాదులు తెగబడ్డారు. పసి పిల్లల తలలను తెగనరుకుతున్న విడియోను ఇస్వాప్ ప్రచార విభాగం అమాక్ జారీ చేసింది. ఒకరికి మాత్రం కణత దగ్గర తుపాకి పెట్టి కాల్చి చంపడం జరిగింది. విడియోలో ఇది సమస్త క్రైస్తవులకు హెచ్చరిక అని ఉగ్రవాదులు ప్రకటించారు.

గత కొంత కాలంగా ఇస్వాప్ ఉగ్రవాదులు క్రైస్తవులపై దాడుల ఉధృతిని పెంచారు. పలు చోట్ల వాహనాలను బలవంతంగా ఆపి, క్రైస్తవులను గుర్తించి వారిని చంపివేయడం సర్వ సాధారణమౌతోంది. సాధారణ పౌరులను ఈ విధంగా అడ్డగించి చంపివేయడాన్ని ఐక్య రాజ్య సమితి కూడా ఖండించింది. గత ఆదివారం నాడు కూడా రాజధాని మైదుగురి వద్ద ఆరుగురిని ఉగ్రవాదులు బలిగొన్నారు. ఆ తరువాత మరో అయిదుగురిని అపహరించుకుపోయారు. వీరిలో ఇద్దరు స్వచ్ఛంద సహాయక సంస్థ ప్రతినిధులు ఉన్నారు. డిసెంబర్ 5 నాడు కూడా ఉగ్రవాదులు మిలటరీ యూనిఫారంలు ధరించి, మైదుగురి శివార్లలో వాహనాలను నిలుపు చేసి, తనిఖీ చేశారు. అంతకు ముందు మరో పదకొండు మందిని కిడ్నాప్ చేశారు. వీరంతా క్రైస్తవులే. వీరిలో ఒకరు ఉపాధ్యాయులు, మిగతా వారు విద్యార్థులు.

తాము ఐసిస్ నేత అబూ బకర్ అల్ బగ్దాదీని చంపడానికి నిరసనగా ఈ పసి పిల్లలను చంపేస్తున్నామని కూడా ఉగ్రవాదులు తెలిపారు. అబూ బకర్ అల్ బగ్దాదీ అమెరికన్ సేనల నుంచి తప్పించుకునేందుకు అక్టోబర్ నెలలో ఇడ్లిబ్ అనే చోట ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Next Story