కరోనా ఎఫెక్ట్.. ఉగ్రవాదులకు ఐసిస్ సలహాలు..
By అంజి Published on 15 March 2020 4:40 PM IST
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. ప్రపంచాన్ని గడగడలాడించిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ కూడా అప్రమత్తమైంది. తమ ఉగ్రవాదులకు కరోనా సోకకుండా ఐసిస్ జాగ్రత్త పడుతోంది. కరోనా వైరస్ అన్ని దేశాలకు వ్యాపించడంతో ఉగ్రవాదులకు ఐసిస్ పలు సూచనలు జారీ చేసినట్లు సమాచారం. మాస్కులు ధరించాలని, ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలకు సైతం వెళ్లకూడదని ఐసిస్ తమ ఉగ్రవాదులకు చెప్పినట్లు తెలిసింది. ఎప్పటికప్పుడూ చేతుల శుభ్రం చేసుకోవాలని, నిద్రలో లేచిన కూడా చేతులు కడుక్కోవాలని సూచించింది. నిపుణుల సూచనలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పాటించాలని పేర్కొంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలంటూ.. తమ అల్ నబా పత్రికలో చెప్పింది. ప్రపంచాన్ని హడలెత్తించిన ఉగ్ర సంస్థ ఐసిస్.. ఇప్పుడు కరోనా చూసి భయపడుతోంది.
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 5 వేల మందిపైగా మృతి చెందారు. లక్షా 35 వేల మందికి కరోనా సోకింది. భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య 100కు చేరింది. కరోనా వైరస్‌కు వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆయా దేశాలు అన్ని రకాల చర్యలు చేపట్టాయి. ఇక భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని జాతీయ విపత్తుగా ప్రకటించారు. అమెరికాలో కూడా ట్రంప్ ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
ఇరాన్ లో కరోనా సోకిన వారి సంఖ్య 11,364 కు చేరిందని అధికారులు తెలిపారు. ఇరాన్ లోని టెహ్రాన్ ప్రాంతంలో కొత్తగా చాలా కరోనా కేసులు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. చైనా వెలుపల కరోనా కారణంగా ఎక్కువ మరణాలు చోటుచేసుకున్న దేశంగా ఇరాన్ చేరింది. కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో అధికారులు కూడా విఫలమయ్యారు.