సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇషాంత్ శర్మ 'కాలూ' పోస్ట్..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2020 4:02 PM IST
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇషాంత్ శర్మ కాలూ పోస్ట్..!

తాను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నప్పుడు జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నానని వెస్టిండీస్ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ సమీ సోషల్ మీడియాలో ఆరోపించాడు. 'కాలూ' అనే పదంతో తనను పిలిచేవాళ్లని, అప్పట్లో ఆ పదానికి తనకు అర్థం తెలియలేదని, ఇప్పుడు ఆ పదానికి అర్థం తెలిసిన తర్వాత తీవ్ర ఆగ్రహం కలుగుతోందని అన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడే సమయంలో నన్ను 'కాలూ' అని ఎవరైనా పిలిస్తే ఇతర ఆటగాళ్లంతా నవ్వేవాళ్లు. అందరూ నవ్వుతుంటే అదేదో తమాషా మాట అయ్యుంటుందని తేలిగ్గా తీసుకున్నాను. అయితే 'కాలూ' అనే పదానికి అర్థం తెలిసిన తర్వాత స్పందించకుండా ఉండలేకపోతున్నాను. నన్ను ఆ పదంతో పిలిచిందెవరో వాళ్లకూ తెలుసు, నాకూ తెలుసు. వాళ్లందరితో మాట్లాడతాను. చాలా మంది దగ్గర నా ఫోన్ నంబర్లు ఉన్నాయి.. నేను సోషల్ మీడియాలో కూడా అందుబాటులోనే ఉన్నాను.. నాకు క్షమాపణలు చెప్పండి అంటూ వీడియోను పోస్టు చేశాడు.

భారతజట్టు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ సోషల్ మీడియాలో సమీని 'కాలు' అని పిలిచిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2014లో ఇషాంత్ శర్మ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్టు చేసి 'నేను, భువనేశ్వర్, కాలు అండ్ గన్(స్టెయిన్) సన్ రైజర్స్' అంటూ పోస్టు పెట్టాడు. ఇప్పుడు ఈ పోస్టును స్క్రీన్ షాట్ తీసి పలువురు వైరల్ చేస్తున్నారు.

Untitled 2 Copy

డారెన్ సమీకి కూడా ఇంతకు ముందు కాలు అన్న పదానికి అర్థం తెలియకపోవడంతో వివిఎస్ లక్ష్మణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తనను తానే కాలూగా చెప్పుకొన్నాడు. 2014 నవంబర్ లో వివిఎస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ కూడా చేశాడు.

జాత్యహంకారానికి వ్యతిరేకంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం జరుగుతోంది. అమెరికాలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రగులుతూ ఉన్నాయి. క్రికెట్ లో జాత్యహంకారం ఉందని పలువురు ఆరోపణలు చేశారు. డారెన్ సమీ తనను అలా పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. ఇకపై ఇలాంటివి మానేయాలని కోరాడు. డారెన్ సమీకి పలువురు క్రికెటర్లు మద్దతు పలికారు.

Next Story