శృంగారం చేస్తే కరోనా వస్తుందా.? నిపుణులు ఏమంటున్నారు

By అంజి  Published on  21 March 2020 7:59 AM GMT
శృంగారం చేస్తే కరోనా వస్తుందా.? నిపుణులు ఏమంటున్నారు

కరోనా వైరస్‌.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 10 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. చైనా దేశంలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా.. వైరస్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఇక ఇటలీ దేశంలోనైతే మరణ మృదంగమే మోగుతోంది. అయితే ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి. పలు దేశాల్లో దీన్ని అరికట్టేందుకు ఆయా ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించాయి. ప్రస్తుతం ఈ వ్యాధికి నివారణ తప్ప.. మందులు లేవు. అయితే ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది. వైరస్‌ సోకకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చన్న ఆలోచనలు అందరీ మెదళ్లలోనూ మెలుగుతున్నాయి.

ముఖానికి మాస్కులు ధరించడం వల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని చెప్పేందుకు ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్పారని బీబీసీ తన కథనంలో రాసింది. అయితే పరిశుభ్రత పాటించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం ద్వారా దీనిని అరికట్టవచ్చని తెలిసింది.

శృంగారంలో పాల్గొనడం ద్వారా కరోనా వైరస్‌ వస్తుందా అన్న విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని తెలిసింది. ప్రస్తుతానికైతే జలుబు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మాత్రమే ఈ వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు చెబుతున్నారు. చేతుల శుభ్రంగా కడుక్కోవడం, దగ్గుతున్నప్పుడు రుమాలు అడ్డు పెట్టుకోవడం, ముఖాన్ని పదే పదే చేతితో తాకకపోతే.. వైరస్‌ను కట్టడి చేయొచ్చు.

ప్రస్తుతం కరోనా వైరస్‌ నుంచి ప్రజలను రక్షించేందుకు ఎలాంటి టీకా లేదు. కరోనా వైరస్‌ వ్యాప్తికి బ్రేక్‌ వేసేందుకు టీకా తయారీలో పరిశోధకులు నిమగ్నమయ్యారు. ఈ వైరస్‌ ఇంతకుముందు ఎప్పుడు మనుషుల్లో కనబడలేదు. దీనిపై వైద్యులకు మరింత స్పష్టత రావాల్సి ఉంది. కరోనా వైరస్‌ మనిషి శరీరంలోకి వచ్చిన తర్వాత మొదట జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత పొడి దగ్గు, వారం తర్వాత శాస్వలో ఇబ్బందులకు దారి తీస్తుంది. ఈ రకంగా కరోనా వైరస్‌ తన పంజా విసురుతూ.. కరోనా బాధితుడి మృతికి కారణం అవుతోంది.

ప్రకృతి ప్రకోపానికి మారుపేరుగా, యముడికి ఏజెంట్ గా పనిచేస్తోంది కరోనా వైరస్. దీని బారిన పడినవారు కోలుకోవడం కష్టమేనని ఇటలీని చూస్తే అర్థమవుతోంది. వైరస్ కు కేంద్రబిందువైన చైనాలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ..అక్కడ వైరస్ వ్యాప్తి ఉన్నప్పుడు కూడా ఇటలీలో సంభవించినన్ని మరణాలు మాత్రం నమోదు కాలేదు.

Next Story