చాపెల్ దేవుడు.. మేనేజ్ మెంట్ వల్లే నా కెరీర్‌ నాశనం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Jan 2020 9:19 PM IST
చాపెల్ దేవుడు.. మేనేజ్ మెంట్ వల్లే నా కెరీర్‌ నాశనం

టీమిండియా దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్‌ తరువాత అంతటి పేస్ ఆల్ రౌండర్‌ గా కీర్తి గడించాడు ఇర్ఫాన్‌ పఠాన్‌. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఆస్ట్రేలియా వేదికగా 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ లో టెస్టుల్లో, వన్డేల్లో అరగ్రేటం చేశాడి బరోడా బాంబర్.

మొత్తంగా 29 టెస్టుల్లో ఒక సెంచరీ 6 అర్థశతకాల సాయంతో 1105 పరుగులు చేయడంతో పాటు 100వికెట్ల ను నేలకూల్చాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌ లో 120 మ్యాచుల్లో 1544 పరుగులు చేయడంతో పాటు 173 వికెట్లు, 24 టీ20ల్లో 174 పరుగులు చేయడంతో పాటు 28 వికెట్లను పడగొట్టి సత్తా చాటాడు.

అయితే దిగ్విజయంగా సాగిపోతున్న పఠాన్‌ కెరీర్‌ కు కోచ్‌ గ్రెగ్‌ చాపల్ రూపంలో అడ్డుకట్ట పడింది. చాపెల్ కోచ్ అయ్యాక టింలో మితిమీరిన ప్రయోగాలు చేశాడు. అందులో పఠాన్‌ ను ఆల్‌ రౌండర్‌ గా తీర్చిదిద్దడం ఒకటి. బౌలింగ్‌ లో పుల్ ఫామ్‌ లో ఉన్న పఠాన్‌ ను నెట్స్ లో బ్యాటింగ్‌ పై ఎక్కువ ఫోకస్‌ పెట్టేలా చేశాడు. ఇంకేముంది ఇటు బ్యాటింగ్‌ లో సక్సెస్‌ కాలేక.. బౌలింగ్ యాక్షన్ కూడా గతి తప్పడంతో జట్టుకు దూరమయ్యాడు. అడపాదడప జట్టులోకి వస్తూ పోతూ 2012లో తన చివరి వన్డే ఆడాడు. అప్పటి నుంచి టీంలో స్థానం కోసం ఎంతో ప్రయత్నం చేసిన పఠాన్‌ కు నిరాశ తప్పలేదు. దీంతో చేసేది ఏమీ లేక ఇటీవల క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పఠాన్‌ క్రికెట్‌ కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో మాజీ కోచ్‌ గ్రెగ్ చాపెల్ స్పందించాడు.

'జట్టుకు అవసరమైన సమయంలో ఏ పాత్ర పోషించడానికైనా ఈ లెఫ్టార్మ్ బౌలర్ సిద్దంగా ఉండేవాడని కితాబిచ్చాడు. అంతేకాకుండా పఠాన్ అత్యంత ధైర్యవంతుడని అదేవిధంగా నిస్వార్థపరుడని ప్రశంసించాడు. ‘ఇర్ఫాన్ పఠాన్ టెస్టుల్లో సెంచరీ సాధించాడు. అదేవిధంగా వన్డేల్లో శతకానికి దగ్గరగా వచ్చి మంచి ఆల్‌రౌండర్ అని నిరూపించుకున్నాడు. ఇక బౌలింగ్‌లో వన్డేల్లో విశేషంగా రాణించాడు. టెస్టుల్లో కూడా ఆకట్టుకున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టే విధానం నాకు బాగా నచ్చేదన్నాడు. కరాచీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించడం ఇర్ఫాన్ పఠాన్ ఇన్నింగ్స్‌లలో నాకు బాగా నచ్చింది’అని చాపెల్ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే పఠాన్‌ ఆట గాడి తప్పడానికి చాపెల్ అడ్డు అదుపు లేని ప్రయోగాలే కారణమని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటన్నింటిని పఠాన్ తీవ్రంగా ఖండించాడు. తను జట్టు నుంచి దూరం కావడం వెనుక చాపెల్ నిర్ణయాలు కారణం కాదని వేరే ఉన్నాయని తాజాగా మనసు విప్పాడు.

'తాను స్వింగ్ బౌలింగ్ చక్కగా చేస్తానని, గాయాలు, టీమ్ మేనేజ్మెంట్ సహకారలేమితో తన కెరీర్ ముగిసిందని వ్యాఖ్యానించాడు. ‘చాపెల్‌పై ఆరోపణలు.. వాళ్లు చేసిన తప్పిదాలను కవర్ చేసుకోవడం కోసమే చెబుతారు. నేను స్వింగ్ కోల్పోయానన్నది అబద్ధం. అయితే పది ఓవర్ల తర్వాత బంతిని చేతికిస్తే స్వింగ్ రాదు కదా. అదే పొరపాటు దొర్లింది. అప్పట్లో నన్ను ఫస్ట్ బౌలింగ్ చేంజ్‌గా ఉపయోగించుకునేవారు’ అని పఠాన్ వ్యాఖ్యానించాడు. ఇక నా ఆటతీరు విషయానికొస్తే, అప్పట్లో ట్రీట్‌మెంట్ వేరేగా ఉండేది. తొలి బౌలింగ్ మార్పుగా నాకు బంతి ఇచ్చేవారు. ఆరంభ బౌలర్లలో బంతినివ్వకుండా చేసిన ఈ మార్పు వికటించింది. 2008 శ్రీలంకతో మ్యాచ్ గెలిచాక నన్ను జట్టు నుంచి తప్పించారు. ఎలాంటి కారణం లేకుండా జట్టు నుంచి తప్పించడమేమిటో నాకు అర్ధం కాలేదు’ అని పఠాన్ అన్నాడు.

2006 కరాచీ టెస్టు పఠాన్ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఆ టెస్టు తొలి ఓవర్లోనే సల్మాన్ భట్, యూనిస్ ఖాన్, మహ్మద్ యూసుఫ్‌ను పెవిలియన్‌కు పంపి హ్యాట్రిక్ నమోదు చేశాడు. మరోవైపు 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ పాక్‌పై మూడు వికెట్లు తీసి సత్తాచాటాడు. అయితే తర్వాతి కాలంలో తను బౌలింగ్ శైలిని మార్చుకోవడం, బ్యాటింగ్‌పై ఫోకస్ పెంచి రెంటికి చెడ్డ రేవటిలా మారి జట్టులో చోటు కోల్పోయాడని ఇప్పటివరకు వాదన ఉంది. అయితే గాయాలు, టీమ్ మేనేజ్‌మెంట్ సహకారం లేకనే తన కెరీర్ పతనమయ్యిందని తాజాగా పఠాన్ చెప్పడం ఏదైన కొత్త వివాదానికి దారి తీస్తుందేమో చూడాలి. 2012లో చివరి మ్యాచ్ ఆడిన పఠాన్... ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు (5/61) తీయడం కొసమెరుపు.

Next Story